ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
సాక్షి, పాలకొల్లు: ఇరిగేషన్ పనుల్లో 20 శాతం కమీషన్ ఇవ్వలేదని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తనను బెదిరించి తనపై తప్పుడు కేసు పెట్టించారని కాంట్రాక్టర్ పృథ్విరాజ్ ఆరోపించారు. ఎమ్మెల్యే రామానాయుడు నుంచి తనకు రక్షణ కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి ఎమ్మెల్యే రామానాయుడు, సీఐ కృష్ణకుమార్‌పై పృథ్విరాజ్ ఫిర్యాదు చేశారు.
కమీషన్ ఇవ్వటంలేదని తన బిల్లులు నిలుపుదల చేయడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా కాంట్రాక్టు పనులు చేయకుండా చేస్తానని బెదిరించడంతో పాటు తనపై తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఆరు నెలలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు పాలకొల్లు పోలీస్ స్టేషన్‌కు తనను పిలిపించి సీఐ కృష్ణకుమార్ తీవ్రంగా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి తన తండ్రికి కూడా ఫోన్లు చేసి హెచ్చరించారని వాపోయారు.
తనను బెరిరించిన ఎమ్మెల్యే రామానాయుడు, తప్పుడు కేసులు నమోదు చేసిన సీఐ కృష్ణకుమార్ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. నరసాపురం డీఎస్పీని కలవాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి న్యాయం చేస్తానని ఎస్పీ హామీయిచ్చినట్టు పృథ్విరాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment