పాలకొల్లు అర్బన్/పోడూరు: ఆర్టీసీ బస్సులో మహిళలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దౌర్జన్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలకొల్లు నుంచి పెనుగొండ వరకు ఆదివారం అమరావతి పాదయాత్ర సాగింది.
ఈ మార్గంలో ఓ ఆర్టీసీ బస్సు ఎక్కిన ‘నిమ్మల’.. ప్రయాణికులతో మాటామంతీ కలుపుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపైన బురదజల్లే ప్రయత్నం చేయబోయారు. దీంతో ఆ మహిళలు.. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని, ఇంటి స్థలాలు ఇస్తున్నారని వాదించడంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ఈ దృశ్యాన్ని ఒక మహిళ వీడియో తీసింది.
దీంతో, రెచ్చిపోయిన ఎమ్మెల్యే రామానాయుడు ఆ మహిళ చేతిలోని సెల్‌ఫోన్ బలవంతంగా లాక్కున్నారు. ఆ దృశ్యాలను తీసేస్తాను తన సెల్‌ఫోన్ తనకు ఇవ్వాలని ఆ మహిళ ప్రాథేయపడుతున్నా ఎమ్మెల్యే వినకుండా సెల్‌ఫోన్‌ను పక్కనే ఉన్న మరో టీడీపీ నేతకు ఇవ్వడం.. ఆ మహిళ ఎమ్మెల్యే మెడలోని పచ్చకండువాను, చొక్కాను లాగడం.. ఎమ్మెల్యే కేకలు వేయడం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఆయన మహిళల ముందు అభాసుపాలయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
పితాని, నిమ్మలకు ఝలక్..
మరోవైపు.. ఇదే జిల్లా పోడూరు మండలం కవిటం లాకుల వద్ద కూడా బస్సు ప్రయాణికుల నుంచి పాదయాత్రలోని మాజీమంత్రి పితాని, ఎమ్మెల్యే నిమ్మలకు ఝలక్ తగిలింది. పాదయాత్ర పేరుతో టీడీపీ నాయకులు బలప్రదర్శనకు దిగడం.. ట్రాఫిక్ స్తంభించడంతో ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు వారిపై మండిపడ్డాడు.
గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిన అన్యాయం, ఆ ప్రభుత్వం చేసిన మోసం చాలదా? ఇప్పుడు రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తూ ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారంటూ టీడీపీ నేతలను నిలదీశాడు. దీంతో పాదయాత్ర చేస్తున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి పితాని సత్యనారాయణ తదితరులు కంగుతిన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినట్లుగా మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలుపుతామని ప్రయాణికులు తెగేసి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment