సస్యరక్షణే కీలకం | Correction is the key | Sakshi
Sakshi News home page

సస్యరక్షణే కీలకం

Published Tue, Sep 16 2014 12:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

సస్యరక్షణే కీలకం - Sakshi

సస్యరక్షణే కీలకం

  • సిరులు కురిపించే క్యాబేజీ
  •  జిల్లాలో విస్తారంగా సాగు
  •  మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు
  • గిరిజనులకు సిరులు కురిపించే పంట క్యాబేజీ. దీనికి చల్లని వాతావారణం అనుకూలం. ఏజెన్సీతోపాటు మైదానంలో.. ఖరీఫ్, రబీ కాలాల్లో ఏటా సుమారు 15 వేల ఎకరాల్లో సాగువుతోంది. ఈ పంటకు ఎక్కువగా ఆశించే చీడపీడలను నెట్టుకు రాగలిగితే.. మంచి దిగుబడులతోపాటు ఆదాయానికీ ఆస్కారముంటుంది.  
     
    హుకుంపేట, న్యూస్‌లైన్ : క్యాబేజీ పంట ఎంతగా లాభాలను తెచ్చిపెడుతుందో అంతగా చీడపీడలకు గురవుతుంది. దీనికి పెట్టుబడులు అంతగా అవసరం లేదు. ఏజెన్సీ రైతులు ఎలాంటి రసాయన ఎరువులూ వినియోగించకుండానే పూర్తిగా స్వాభావిక సాగుతోనే పండిస్తారు. అయినా దీనికి పురుగుల బెడద తప్పదు. ఈ పంటకు సస్యరక్షణే ప్రధానం. విత్తుకునే ముందు విత్తశుద్ధి తప్పనిసరి. కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడేతో విత్తనశుద్ధి చేసుకుంటే పంటకు రెక్కల పురుగు బెడదను నియంత్రించవచ్చు.
     
    ప్రధాన బెడద

    ఆకుపురుగు దీని ఆకు అడుగు భాగాన్ని తిని గడ్డను తొలిచి రంధ్రాలు చేసి అధికంగా నాశనం చేస్తుంది. ఈ పురుగులు ఆశించిన ఆకులు వాడిపోయినట్టు కనిపిస్తాయి. ఇవి అధికంగా ఉన్నప్పుడు ఆకులలో ఈనెలు మాత్రమే మిగులుతాయి. ఈ పురుగు నివారణకు 0.1 శాతం మలాథియాన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో 50 శాతం లేదా నీటిలో కరిగే డబ్ల్యూపీ కార్బరిల్‌ను 0.15 శాతం 3 మిల్లీ గ్రాముల మందును లీటరు నీటిలో చొప్పున కలిపి పిచికారీ చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.  
     
    క్యాబేజీ తొలుచు పురుగు: వీటి పిల్ల పురుగు ఆకులను చుట్టుకునేట్లుగా చేయడం లేదా కాండం లోపల రంధ్రాలు చేసి తినడానికి ఉపయోగం లేకుండా చేస్తుం ది. ఇవి గడ్డను కూడా తొలిచి రంధ్రాలు చేస్తాయి. ఈ పురుగు నివారణకు 0.1 శాతం మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా 0.05 శాతం ఎండోసల్ఫాన్ లీటరు నీటిలో క లిపి పిచికారీ చేయాలి.  
     
    ఆకునల్లి పురుగు: పిల్ల పురుగులు ఆకులు కొమ్మల నుంచి రసాన్ని పీల్చడం వల్ల వడిలినట్టు కనిపించడమేకాకుండా మొక్కలు బలహీనమవుతాయి. ఈ పురుగు నివారణకు 0.1 శాతం మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.  
     
    ఆకుముడత పురుగు: ఇవి ఆకు అడుగు భాగంలో ఉండి ఆకులు ముడుచుకునేటట్లు చేసి పత్రహరితాన్ని తినేసి ఈనెను మాత్రం మిగుల్చుతాయి. ఈ పురుగులు పువ్వులను గడ్డలను కూడా ఆశిస్తాయి. వీటి నివారణకు 0.04 శాతం మోనోక్రోటోఫాస్1 మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి పైరు చల్లాలి.  
     
    ఆకుపచ్చ దాసరి పురుగు : ఇది ఆకులకు రంధ్రాలు చేయడమే కాక ఆకులలో ఈనెలు మాత్రమే మిగిల్చి నాశనం చేస్తుంది.  ఈ పురుగు నివారణకు 0.05 శాతం క్వినాల్ ఫాస్ 2 మిల్లీ లీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.  
     
    పొగాకు లద్దెపురుగు :
    ఇవి రాత్రిపూట సంచరిస్తాయి. ఇవి ఆకులను, చిగుళ్లను తింటాయి.  చిన్న లద్దె పు రుగులు ఆకుల్లోని ఆకుపచ్చని పదార్థం తినేసి ఈనెలను మాత్రం మిగులుస్తాయి. తదుపరి వె డల్పాటి ఆకులను పూర్తిగా తినేస్తాయి. ఈ పురుగు నివారణకు గడ్డ ఏర్పడే ముం దు 0.05 శాతం కార్బరిల్ 3 గ్రా ముల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.  
     
    మందులు అందుబాటులో లేవు
    నాది హుకుంపేట మండలం చీకటిపుట్టు. అర ఎకరా భూమిలో క్యాబేజీ పంట చేపట్టాను. ఏటా సులభంగా చీడపీడలకు గురవుతోంది.  వాటికి పురుగు మందులు పిచికారీ చేసేందుకు మందులు అందుబాటులో లేకుండా పోయాయి. ఒడిశా, విజయనగరం వెళ్లి పురుగుమందులు తెచ్చుకోవడం వల్ల ఖర్చులు అధికం అవుతున్నాయి.  
     -వంతాల రామన్న రైతు
     
     సకాలంలో స్పందించాలి
     సకాలంలో స్పందించి సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు వస్తాయి. కష్టానికి తగ్గ ప్రతి ఫలం ఉంటుంది. చీడపీడల కారణంగా క్యాబేజీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక్కడి చల్లని వాతావరణం క్యాబేజీకి ఎంత అనుకూలమో, చలిగాలుల వల్ల తెగుళ్లు కూడా అదేవిధంగా వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఉంది.  
     -చిట్టిబాబు, ఐటీడీఏ పీహెచ్‌వో, పాడేరు
     
     అధికారులు సహకరించాలి
     నాది హుకుంపేట మండలం బొడ్డాపుట్టు. ఎకరా భూమిలో పంటను చేపట్టాను. అధికారులు సహకారం లేకపోవడంతో ఏ తెగులుకు ఏ మందు పిచికారీ చేయాలో తెలియక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.  గ్రామంలో సిబ్బంది పర్యటించి తగిన సకాలంలో తగిన సూచనలు సలహాలు అందిస్తే బాగుంటుంది.            
     - పి. బాబురావు, రైతు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement