అక్రమాలకు ‘చెక్’ పెట్టాల్సిన చెక్‌పోస్టులు అవినీతి నిలయాలుగా మారాయి. ఉద్యోగుల చెయ్యి తడిపితే చాలు..ఛలో అంటుండడంతో జిల్లా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ సంపద, కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
ఖమ్మం, న్యూస్‌లైన్: అక్రమాలకు ‘చెక్’ పెట్టాల్సిన చెక్‌పోస్టులు అవినీతి నిలయాలుగా మారాయి. ఉద్యోగుల చెయ్యి తడిపితే చాలు..ఛలో అంటుండడంతో జిల్లా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ సంపద, కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా జిల్లా సరిహద్దు ప్రాంతాలైన భద్రాచలం, పాలేరు, అశ్వారావుపేట, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉన్న చెక్‌పోస్టుల్లో తనిఖీలు నామ మాత్రంగా ఉండటంతో విలువైన కలప, వ్యవసాయ ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 43 వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్‌పోస్టులు, అటవీశాఖ పరిధిలో 12 చెక్‌పోస్టులు ఉండగా పలుచోట్ల అధికారులు బినామీ ఉద్యోగులను పెట్టి నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కోట్లాది రూపాయలప్రభుత్వ ఆదాయానికి గండి
చెక్‌పోస్టుల్లో పనిచేసే పలువురు అధికారులు చేతివాటం ప్రదర్శించి వాహనాల తనిఖీల్లో ఉదాసీనంగా వ్యవహరించడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను రైతులే ఏ ప్రాంతానికైనా తీసుకువెళ్లి అమ్ముకోవచ్చు. దీనిని ఆసరాగా తీసుకొని పలువురు వ్యాపారులు రైతుల పేరున స్లిప్స్ రాయించుకొని.. తామే రైతులమని చెబుతూ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు తరలిస్తున్నారు. రైతులు ఉత్పత్తి హక్కు రసీదును రెవెన్యూశాఖ అధికారుల నుంచి తీసుకోవాలి. అక్కడ అధికారులు కూడా మామూళ్లకు ఆశపడి ఖాళీ రసీదులు వ్యాపారుల చేతికి ఇవ్వడంతో వారు తమకు నచ్చిన రైతుల పేర్లు రాసుకుంటూ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో సమృద్ధిగా సాగునీటి వనరులు, సారవంతమైన భూములు ఉండటంతో ఇతర జిల్లాలతో పోటీపడి రైతులు పంటలు పండిస్తున్నారు.
43 చెక్ పోస్టుల ద్వారా సగటున నెలకు రూ.40లక్షల మేరకు సెస్‌ల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. చెక్‌పోస్టు అధికారులు సక్రమంగా ఉంటే ఈ ఆదాయం కోటికి చేరే అవకాశం ఉందని మార్కెట్ కమిటీల అధికారులు పలువురు చెబుతున్నారు. దీంతోపాటు పేదలకు సరఫరా చేసే బియ్యం సైతం దారిమళ్లుతున్నా పట్టింపులేదనే విమర్శలున్నాయి. అలాగే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చే మిల్లులు జిల్లాలో ఉన్నాయి. నల్గొండ, వరంగల్, కృష్ణా జిల్లాల నుంచి బియ్యం జిల్లాకు తరలి వస్తున్నా చెక్‌పోస్టుల వద్ద పట్టించుకున్న వారే కరువయ్యారు. గతంలో పలుచోట్ల విజిలెన్స్ అధికారులు చేసిన దాడుల్లో అక్రమమార్గంలో తరలుతున్న బియ్యం పట్టుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం.
దొడ్డిదారిన తరలుతున్న అటవీ సంపద
చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో జిల్లాలోని విలువైన అటవీ సంపద దొడ్డిదారిన తరలుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. అశ్వారావుపేట మండలకేంద్రంలోని ఫారెస్టు చెక్‌పోస్టులో పలువురు ఉద్యోగులు బినామీలను నియమించడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. హైవేపై వెళ్లే ప్రతి కలప లారీ నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. వే లేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఫారెస్టు చెక్‌పోస్టు లేనందున అక్రమ కలప రవాణాకు అడ్డుకట్ట వేసే నాధుడే లేడని విమర్శలు వస్తున్నాయి. సత్తుపల్లి, తల్లాడలోని కొత్తగూడెంరోడ్‌లో ఉన్న అటవీశాఖ చెక్‌పోస్టు మీదుగా కలప యథేచ్ఛగా రవాణా అవుతోంది. భద్రాచలం గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన అటవీశాఖ చెక్ పోస్టు మీదుగానే డివిజన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి వివిధ లోడ్లలతో వచ్చే వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. కలప, బీడీ ఆకులు, బీపీఎల్ కర్మాగారానికి వెళ్లే జామాయిల్ లోడ్లతో వెళ్లే వాహన దారుల నుంచి ఇక్కడి సిబ్బంది ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో వాహనానికి ఒక్కో రేటును నిర్ణయించి దర్జాగానే వసూళ్లకు పాల్పడుతున్నారని, పైగా పెద్ద సార్లు చెబితేనే డబ్బులు వసూలు చేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తులైన పత్తి, మిర్చి వాహనాల్లో విలువైన కలపను ఉంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు అనునిత్యం రవాణా కొనసాగిస్తున్నారని, అయితే ఈ వాహనాలు, వాటి నెంబర్లు అటవీ ప్రాంతంలో ఉన్న పలు చెక్‌పోస్టు అధికారులకు ముందుగానే చెప్పి వారి మామూళ్లు వారికి పంపడంతో ఆయా వాహనాల తనిఖీ జరగదని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెక్‌పోస్టులపై దృష్టి సారించాలని, అక్రమార్కుల ఆటలు కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.