అవినీతికి లేదా‘చెక్’
అక్రమార్జనకు ఆనవాళ్లు.. చెక్‌పోస్టులు
ఏసీబీ దాడులనూ లెక్కచేయని అధికారులు
ప్రైవేటు వ్యక్తులతో వసూళ్ల పర్వం
తాజా దాడుల్లోనూ నగదు స్వాధీనం
జిల్లాలో చెక్‌పోస్టులు అవినీతికి కేరాఫ్‌గా మారుతున్నాయి. సరుకు రవాణాలో అవకతవక లను గుర్తించి పన్ను విధించాల్సిన అధికారులే అక్రమార్కులతో చేయి కలుపుతున్నారు. చెక్‌పోస్టుల్లోనే అవినీతి దుకాణం తెరుస్తున్నారు. చేయి తడపందే వాహనం కదిలేందుకు అనుమతులు ఇవ్వడం లేదు. అడిగినంత ఇస్తే చాలు.. వే బిల్లులో పేర్కొన్న సరుకు కంటే ఎక్కువ ఉన్నా పట్టింపులేదు. దీంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడుతోంది. జిల్లా ఉన్నతాధికారులకే రోజువారీ ముడుపులందుతుండటంతో వీరి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా జంకకపోవడమే వీరి బరి తెగింపునకు నిదర్శనం. ప్రైవేటు వ్యక్తులను నియ మించుకుని మరీ వసూళ్లకు తెగబడుతున్నారు. సోమవారం కూడా ఏసీబీ దాడులు నిర్వహించింది.
చిత్తూరు(కార్పొరేషన్): ఇటీవల నాగులాపురం చెక్‌పోస్టు ఉద్యోగి ఓ వ్యాపారి వద్ద లంచం డిమాండ్ చేస్తూ వీడియోతో సహా పట్టుబడిన సంఘటన జరిగి నెల కూడా గడవక ముందే.. సోమవారం నరహరి పేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు, పలమనేరు చెక్‌పోస్టుల్లో ఏసీబీ దాడి చేసింది. ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని మరీ దందాకు పాల్పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఉండరాదని నిబంధనలున్నా అధికారులు ఖాతరు చేయడం లేదు. దీంతో సరుకు రవాణా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా అమ్యామ్యాలు ఆశిస్తుండటంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కాలంలో డీజిల్, ఇతర పన్నులు భారీగా పెరగడంతో ఏమీ మిగటం లేదని వాపోతున్నారు.
మారని తీరు–వ్యాపారుల బేజారు
జిల్లా రెండు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉం డటం.. వాణిజ్యపరంగా వేగంగా అభివృ ద్ధి చెందుతుండటం... ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు జిల్లాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంటే ఎక్కువ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నరహరిపేట, జోడిచింతల, నాగలాపురం, పలమనేరు, ఠాణా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేశారు. పక్క రాష్టాలనుంచి జిల్లా మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను చెక్‌పోస్టుల్లో ధ్రువీకరణపత్రాల తనిఖీలు నిర్వహిస్తుంటారు. వే–బిల్లు, ట్రాన్సి స్టు పాస్, గూడ్స్ బిల్లు తనిఖీలు చేసుకుని రాకపోకలు సాగిస్తారు. అన్ని çపత్రాలు సక్రమంగా ఉన్నా చేతిలో పచ్చనోటు పెట్టనిదే బండికి అనుమతి లభించడం లేదు. ఇటీవల సీటీశాఖ చట్టాలు మరింత కఠినతరంగా మార్చింది. బిల్లులు సక్రమంగా లేకపోతే విలువ కంటే ఎక్కువగా జరిమానా విధించే విధంగా చట్టాలు మార్చింది. ఈ నిబంధనలే చెక్‌పోస్టుల్లో బాధ్యతలు నిర్వహించే అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో వ్యాపారులు చేసే చిన్న పొరపాట్లు, డ్రైవర్ల అవగాహన లేమిని సాకుగా చూపి సిబ్బంది నుంచి∙ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇవిగో సాక్ష్యాలు
గడిచిన సంవత్సరంలోనే ఆరు సార్లు చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు జరిగినా సిబ్బంది తీరులో మార్పురాలేదు. క్షేత్రస్థాయిలో ప్రైవేటు వ్యక్తులు పనిచేయడం లేదని ఉన్నతధికారులు చెబుతున్నా నిత్యం చెక్‌పోస్టుల్లో ప్రైవేటు సిబ్బంది ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు.
⇒గత సంవత్సరం న రహరిపేట చెక్‌పోస్టులో నిర్వహించిన తనిఖీల్లో అధికారికంగా వసూలు చేసిన బిల్లులు మొత్తం రూ.70వేలు కాగా అక్కడ అనధికారికంగా రూ.30 వేలు లభించింది.
⇒తిరుపతి సీటీవోగా ఉన్న శ్రీనివాసులు నాయుడు వేధింపులకు నిరసనగా వ్యాపారస్తులు మూడు రోజులు ధర్నా నిర్వహిం చారు. అయినా అధికారుల నుంచి వ్యాపారులకు వేధింపులు తప్పడం లేదు.
⇒సెప్టెంబరులో నాగలాపురం చెక్‌పోస్టులో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఏసీటీవోను డీసీ సస్పెండ్ చేశారు. డిసెంబర్‌లో నాగలాపురం చెక్‌పోస్టు డీసీటీవో లంచం తీసుకొని సస్పెండ్‌కు గురికావడం తెలిసిందే. గడిచిన ఐదు నెలల్లో చెక్‌పోస్టుల్లో దాటుకొని రూ.1.10 కోట్లు విలువైన గుట్కాలను పోలీసులు పట్టుకున్నారు.
⇒పలమనేరు, నరహరిపేట చెక్‌పోస్టుల్లో సోమవారం జరిగిన దాడుల్లో అధికారులకు దాదాపు రూ.90 వేలు లెక్కల్లో లేని సొమ్ము తేలింది.