అవినీతి ధార | Corruption in the Vamsadhara Project Works | Sakshi
Sakshi News home page

అవినీతి ధార

Published Sat, Mar 23 2019 5:28 AM | Last Updated on Sat, Mar 23 2019 5:28 AM

Corruption in the Vamsadhara Project Works - Sakshi

సాక్షి, అమరావతి: వంశధార ప్రాజెక్టు పనుల్లో అవినీతి.. ‘ధార’లా ప్రవహిస్తోంది. ఐదేళ్లలో కేవలం 15 శాతం పనులు పూర్తి చేయడానికి రూ.930.01 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ ప్రభుత్వం.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లందించలేకపోయింది. కానీ రూ.92.02 కోట్ల పనుల వ్యయాన్ని రూ.1,104.13 కోట్లకు పెంచేయడం ద్వారా చంద్రబాబు తన బినామీలకు వందలాది కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చారు. ఇంకా రూ.266.13 కోట్లు ఖర్చు చేస్తే గానీ ప్రాజెక్టు పనులు పూర్తి కావని అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం. అత్యంత వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో వంశధార రెండో దశ పనులకు రూ.933.90 కోట్ల వ్యయంతో శ్రీకారం చుట్టారు. ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయగా.. దీనిపై ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడేవరకు ఆగకుండా ఆయకట్టు రైతులకు త్వరగా ప్రయోజనం చేకూర్చేందుకు ఆ ప్రాజెక్టును రీ డిజైనింగ్‌ చేయించారు. వంశధారపై బామిని మండలం కాట్రగడ వద్ద సైడ్‌ వియర్‌ నిర్మించి.. అక్కడ్నుంచి కాలువ ద్వారా నీటిని మళ్లించి.. సింగిడి, పారాపురం, హిరమండలం రిజర్వాయర్లలో నిల్వ చేసి.. గొట్టా బ్యారేజీ కింద 2,10,510 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించి 3.26 లక్షల మంది దాహార్తి తీర్చాలని వైఎస్సార్‌ నిర్ణయించారు.
- వంశధారపై సైడ్‌ వియర్‌ నిర్మాణం, 14.205 కి.మీ. మేర వరద కాలువ తవ్వకం, సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులను 87వ ప్యాకేజీ కింద 2005లో హార్విన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ రూ.72.64 కోట్లకు దక్కించుకుంది. ఇందులో 29.54 కోట్ల పనులను పూర్తి చేసింది. రూ.43.10 కోట్లు ఖర్చు చేస్తే ఈ పనులు పూర్తయ్యేవి.
వంశధార ప్రాజెక్టు రెండో దశలో 14.205 కి.మీ. నుంచి 34.100 కి.మీ. వరకు వరద కాలువ తవ్వకం, పారాపురం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులను 88వ ప్యాకేజీ కింద శ్రీనివాస కన్‌స్టక్షన్స్‌ 2005లో రూ.66.88 కోట్లకు దక్కించుకుంది. రూ.31.24 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. మరో రూ.35.64 కోట్లు ఖర్చు చేస్తే ఈ పనులు పూర్తయ్యేవి.
హిరమండలం రిజర్వాయర్‌ నిర్మాణం, స్పిల్‌ వే రెగ్యులేటర్, హై లెవల్‌ కెనాల్‌.. లింక్‌ కెనాల్, సర్‌ప్లస్‌ చానల్‌ తవ్వకం పనులను రూ.353.50 కోట్లకు 2005లో సోమా పటేల్‌ ఏఎస్‌ఐ(జేవీ) సంస్థ దక్కించుకుంది. 2014 నాటికి రూ.259 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ఇంకో రూ.94.5 కోట్లు ఖర్చు చేస్తే ఈ పనులు పూర్తయ్యేవి. మరోవైపు భూసేకరణ, నిర్వాసితుల పరిహారం చెల్లింపు, పనులకు కలిపి 2014 నాటికి మొత్తంగా రూ.841.88 కోట్లు ఖర్చు చేసి 85 శాతం పనులు పూర్తి చేశారు.

బినామీలకు లబ్ధి..
టీడీపీ అధికారంలోకి వచ్చాక వంశధార ప్రాజెక్టు రెండో దశ పనులకు 2014–15లో రూ.16.15 కోట్లు, 2015–16లో రూ.34.57 కోట్లు, 2016–17లో రూ.463.37 కోట్లు, 2017–18లో రూ.261.54 కోట్లు, 2018–19లో రూ.154.38 కోట్లు.. మొత్తంగా రూ.930.01 కోట్లు ఖర్చు చేసింది. గతంలో 2017 జూన్‌ నాటికే వంశధార నుంచి నీళ్లు అందిస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం.. ఇప్పటికి కూడా ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేకపోయింది. ఒక్కటంటే ఒక్క ఎకరాకు నీళ్లందించలేకపోయింది. కానీ పెంచేసిన అంచనా వ్యయం ప్రకారం సీఎం చంద్రబాబు.. తన బినామీలకు రూ.650 కోట్లకుపైగా లబ్ధి చేకూర్చారు. ఆ మేరకు చంద్రబాబు కమీషన్లు కూడా వసూలు చేసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇంకా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.266.13 కోట్లు అవసరమని చెబుతుండటం గమనార్హం. 

అంచనా వ్యయం పెంచి.. బినామీలకు కట్టబెట్టి
2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే 87, 88 ప్యాకేజీల కాంట్రాక్టర్లపై వేటు వేశారు. ఇంకా 15 శాతం పనులే మిగిలి ఉండగా.. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని మాత్రం రూ.933.90 కోట్ల నుంచి రూ.2,038.03 కోట్లకు పెంచేశారు. ఆ తర్వాత 87వ ప్యాకేజీలో మిగిలిన రూ.43.10 కోట్ల పనుల వ్యయాన్ని రూ.162.10 కోట్లకు పెంచేసి సీఎం రమేశ్‌ సంస్థకు అప్పగించారు. 88వ ప్యాకేజీలో మిగిలిన రూ.35.64 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.179 కోట్లకు పెంచేసి తన బినామీకి చెందిన సాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించారు. ఇక హీరమండలం రిజర్వాయర్‌ పనులు చేస్తున్న సోమ(జేవీ) సంస్థ తమ బినామీకి చెందినదే కావడంతో దాన్ని మాత్రం కొనసాగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement