
జర్నలిస్ట్‌లపై దాడులను ఉపేక్షించం
సీపీ గౌతమ్ సవాంగ్
విజయవాడ (భవానీపురం) : జర్నలిస్ట్‌లపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. గత శుక్రవారం రాత్రి వన్‌టౌన్‌లోని ముస్లిం శ్మశానవాటిక వివాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన కాకతీయ దినపత్రిక బ్యూరో చీఫ్ షేక్ షఫీవుల్లాపై పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సమక్షంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధుల బృందం పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను కలిసి వినతి పత్రం అందచేసింది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు ఘటన పూర్వాపరాలను సీపీకి వివరించారు.
దీనిపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ సమాజ హితాన్ని కోరే జర్నలిస్ట్‌లపై దాడులు వాంఛనీయం కాదన్నారు. దాడి ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ కమిషనర్‌ను కలిసినవారిలో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి.రామారావు, దారం వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు చావా రవి, నిమ్మరాజు చలపతిరావు ఉన్నారు.