రామకృష్ణ (ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు ఎక్కువయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు! చింతమనేనిని చూసి ఎందుకు భయపడుతున్నారని, చింతమనేనికి చట్టాలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. చింతమనేనిని వెంటనే అరెస్టు చెయ్యాలని, లేకపోతే అమరావతిలో ఆందోళన చేస్తామన్నారు. వారం రోజులకుపైగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని అడిగారు.
ప్రభుత్వం కార్మికుల సమ్మెలను పోలీసులతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కరువు వల్ల రైతులు అప్పులతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 29వ తేదీన అనంతపురంలో కరువుపై కవాతు నిర్వహిస్తామని తెలిపారు. తుఫాన్ వల్ల మరణించిన వారికి ఇరవై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. నాలుగేళ్లు అయినా ఇప్పటివరకు ఒక్కరికి కూడా న్యాయం చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment