సాక్షి, విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. మతాల మధ్య అంతరం పెంచడానికి చూస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ గురువారం ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.
ధర్నాలో రామకృష్ణ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసనలు వ్యక్తం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ హిందుమత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా తన వైఖరి చూపుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్‌ఆర్‌సీ ద్వారా ప్రజల మధ్య విభజన తెచ్చేలా చేస్తున్నారని.. వెంటనే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మైనారిటీలకు అండగా దేశవ్యాప్తంగా బంద్‌కు సైతం పిలుపునిస్తామని రామకృష్ణ హెచ్చరించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చటాన్ని ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఆరంభం మాత్రమే అని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. బీజేపీ రాజ్యాంగం మీద తలపెట్టిన దాడిని తిప్పి కొడతామని మధు అన్నారు. ఇది హిందు ముస్లింల సమస్య కాదని.. లౌకికవాద సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment