
సాక్షి, చింతూరు/శ్రీకాకుళం : ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి శ్రీకాకుళం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననేత నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చింతూరు మండలానికి చెందిన సీపీఎం నాయకులు, ఎంపీపీ చిచ్చిడి మురళితో సహా.. మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బుధవారం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
బాబు మమ్మల్నిమోసం చేశాడు
ఎన్నికలకు ముందు రజకులను ఎస్సీల్లో కలుపుతామని హామీనిచ్చిన చంద్రబాబు మోసం చేశాడని రజక సంఘం నాయకులు ఆరోపించారు. రజకులకు ఒక కార్పొరేషన్, రాజకీయంగా ప్రాధాన్యం కలిపించాలని పాదయాత్రలో పాల్గొని వైఎస్ జగన్‌ను కోరారు. ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగులు వైఎస్ జగన్‌కు విన్నవించారు. బలసల రేవు వంతెన నిర్మించాలని కోరుతూ వాల్తేరు గ్రామ ప్రజలు వైఎస్ జగన్‌కు విన్నవించారు. 650 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు.