బెట్టింగ్ బుకీ సోదరుల అరెస్టు | Cricket Betting brothers arrested | Sakshi
Sakshi News home page

బెట్టింగ్ బుకీ సోదరుల అరెస్టు

Published Fri, Jul 15 2016 12:00 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Cricket Betting brothers arrested

 శ్రీకాకుళం సిటీ : రాష్ట్రంలో, జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నగరానికి చెందిన బుకీ సోదరులు నారాయణశెట్టి వెంకటకిరణ్, నారాయణశెట్టి రవికాంత్‌లను అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావునాయుడు తెలిపారు. గురువారం రాత్రి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివ రాలను వెల్లడించారు.
 
 నగరంలోని కోటివీధిలో బుకీ సోదరులు ఉన్నారన్న సమాచారంతో రెండో పట్టణ పోలీసులు దాడులు చేసినట్టు చెప్పారు. ఇద్దరిని వారి ఇంట్లోనే అదుపులోనికి తీసుకున్నామన్నారు. ఈ బుకీ సోదరలు 2009వ సంవత్సరం నుంచి దేశ, విదేశాల్లో  క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ రూ.కోట్లలో ఆస్తులు సంపాదించినట్లు పేర్కొన్నారు. వీరికి శ్రీకాకుళంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు సహకరించినట్లు తెలిపారు.
 
 స్వాదీనం చేసుకున్నవి..
 గురువారం ఉదయం బుకీ సోదరులను వారి నివాసంలోనే అదుపులోనికి తీసుకున్నామని, వారి నుంచి రూ.1.88 లక్షల నగదు, రూ.2.50 లక్షలు విలువచేసే 9తులాల బంగారం, రూ.2 లక్షలు విలువచేసే మూడు బైక్‌లు, 2 సెల్‌ఫోన్‌లు, రూ.13 లక్షల విలువ చేసే కారు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 
 ఆస్తులపై విచారణ
 ఈ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన బుకీ సోదరులు రూ.26.11 కోట్ల మేర విలువైన ఆస్తులను సంపాదించినట్టు డీఎస్పీ చెప్పారు. నగరంలో రూ.7 కోట్ల విలువైన కోణార్క్‌షాప్, దీపామహాల్ దరి రూ.40 లక్షలు విలువైన ఒకసైట్, సానావీధిలో రూ.15 లక్షల విలువైన ఒక ప్లాట్, నగరంలో రూ.17 కోట్ల విలువ చేసే శ్రీపియ ఖాళీ స్థలంలో వాటా, పెయ్యలవానిపేటలో రూ.60 లక్షల మేర వాటర్‌ప్లాంట్, రూ.45 లక్షల విలువచేసే ప్రస్తుతం కోటివీధిలో వీరి నివాస గృహం, రూ.45 లక్షలు విలువ చేసే అయ్యప్పదేవ్ పార్టనర్ షిప్ స్థలం, నాన్నకు ప్రేమతో సినిమాకు రూ.4.10 లక్షలు, నవమన్మధుడు సినిమాకు రూ.2.40 లక్షల పార్టనర్‌షిప్‌లు వీరికి ఉన్నాయన్నారు.
 
  వీరిని కోర్టులో హాజరుపరిచి, ఆస్తులపై విచారణ చేపట్టనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఆస్తులను ఆర్‌ఆర్‌చట్టం ప్రకారం జప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బుకీల సోదరులను అరెస్టు చేయడంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ దాడి మోహనరావు, సిబ్బంది హెచ్‌సీ రమేష్‌బాబు, ఎల్.జగన్మోహనరావు, పీసీలు కె.మోహనదత్త, కె.రామకృష్ణ, వై.ప్రదీప్, కె.మహేష్‌లను డీఎస్పీ భార్గవరావునాయుడు అభినందించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement