brothers arrested
-
సొంత తమ్ముళ్లే.. మూడుసార్లు 'కప్పు టీ' తో అన్నపై..
ఆదిలాబాద్: తమ చేనులో ఉన్న నిధి తవ్వకానికి అడ్డువస్తున్న తమ్ముళ్లు అన్నను అడ్డు తొలగించుకోవడానికి పథకం వేసి దొరికిపోయారు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన షేక్ బిలాల్, షేక్ సులేమాన్, షేక్ ఆదాం ముగ్గురు అన్నదమ్ములు. తమ చేనులో ఉన్న నిధి (బంగారం)ని తవ్వడానికి అన్న షేక్ ఆదాం ఒప్పుకోడని నిర్ధారించుకుని అతడిని అంతం చేయాలని షేక్ బిలాల్, షేక్ సులేమాన్ పథకం పన్నారు. గ్రామానికి చెందిన షేక్ అజ్గర్‌ను కలిసి షేక్ ఆదాంను మట్టుబెట్టడానికి గ్రామానికి చెందిన తాళ్ల రమేశ్‌తో బేరం కుదుర్చుకున్నారు. తాళ్ల రమేశ్ పథకం ప్రకారం షేక్ ఆదాంకు తన ఆవును విక్రయిస్తానని నమ్మించి ఈ నెల 5న ఇంటికి పిలిచాడు. తనే స్వయంగా చాయ్‌లో మత్తు పదార్థాలు కలిపి షేక్ ఆదాంకు ఇవ్వగా అతడు దానిని తాగలేదు. మళ్లీ 8వ తేదీన ఆదాం తన టైలర్‌షాప్‌లో పని చేస్తుండగా రమేశ్ హోటల్ నుంచి చాయ్ తీసుకువచ్చి ఆదాంకు ఇచ్చాడు. అనుమానంతో ఆదాం చాయ్ తాగలేదు. అదేరోజు సాయంత్రం ఆదాం తన చేనులో పని చేస్తుండగా రమేశ్ చాయ్ తీసుకువెళ్లాడు. దీంతో అనుమానించిన ఆదాం రమేశ్‌ను బెదిరించాడు. దీంతో రమేశ్ అసలు విషయం చెప్పాడు. దీంతో ఆదాం పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
చోర సోదరుల అరెస్టు
గుంటూరు: తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని గత మూడేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి రూ.7 లక్షల విలువచేసే బంగారు, వెండి వస్తువులతో పాటు చోరీలకు వినియోగించిన ఆటో, ల్యాప్‌ట్యాప్, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పులి వెంకట కాలనీకి చెందిన సైదాపేట రామిరెడ్డి అలియాస్ రాము అలియాస్ డేవిడ్, అతని సోదరుడు శివారెడ్డి అలియాస్ శివ అలియాస్ యేసోబు పగటి సమయంలో ఆటోలో సంచరిస్తూ పాత ఇనుము సామాన్లు కొనుగోలు చేస్తున్నట్టుగా నటిస్తూ తాళాలు వేసి వున్న ఇంటిని గుర్తిస్తారు. రాత్రయ్యాక ఆటోను దూరంగా నిలిపి వెళ్లి వారి వద్ద వున్న పరికరాలతో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతుంటారు. మూడేళ్లకాలంగా ఇదే తంతు కొనసాగుతోంది. ఈ క్రమంలో ముందస్తు సమాచారంతో నల్లపాడు, సీసీఎస్ పోలీసులు జాతీయ రహదారిపై నిఘా పెట్టడంతో అంకిరెడ్డిపాలెం గ్రామ సమీపంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద వున్న బ్యాగులో పరిశీలించగా బంగారు, వెండి వస్తువులతో పాటు నాలుగు ల్యాప్‌ట్యాప్‌లు, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నేరాలకు ఉపయోగించే పరికరాలతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గుంటూరు అర్బన్‌లో ఆరు, ప్రకాశంలో రెండు, తిరుపతి అర్బన్‌లో ఒక కేసు నమోదై వుందని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు,సిబ్బంది పాల్గొన్నారు. -
బెట్టింగ్ బుకీ సోదరుల అరెస్టు
శ్రీకాకుళం సిటీ : రాష్ట్రంలో, జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నగరానికి చెందిన బుకీ సోదరులు నారాయణశెట్టి వెంకటకిరణ్, నారాయణశెట్టి రవికాంత్లను అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావునాయుడు తెలిపారు. గురువారం రాత్రి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివ రాలను వెల్లడించారు. నగరంలోని కోటివీధిలో బుకీ సోదరులు ఉన్నారన్న సమాచారంతో రెండో పట్టణ పోలీసులు దాడులు చేసినట్టు చెప్పారు. ఇద్దరిని వారి ఇంట్లోనే అదుపులోనికి తీసుకున్నామన్నారు. ఈ బుకీ సోదరలు 2009వ సంవత్సరం నుంచి దేశ, విదేశాల్లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ రూ.కోట్లలో ఆస్తులు సంపాదించినట్లు పేర్కొన్నారు. వీరికి శ్రీకాకుళంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు సహకరించినట్లు తెలిపారు. స్వాదీనం చేసుకున్నవి.. గురువారం ఉదయం బుకీ సోదరులను వారి నివాసంలోనే అదుపులోనికి తీసుకున్నామని, వారి నుంచి రూ.1.88 లక్షల నగదు, రూ.2.50 లక్షలు విలువచేసే 9తులాల బంగారం, రూ.2 లక్షలు విలువచేసే మూడు బైక్‌లు, 2 సెల్ఫోన్లు, రూ.13 లక్షల విలువ చేసే కారు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులపై విచారణ ఈ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన బుకీ సోదరులు రూ.26.11 కోట్ల మేర విలువైన ఆస్తులను సంపాదించినట్టు డీఎస్పీ చెప్పారు. నగరంలో రూ.7 కోట్ల విలువైన కోణార్క్షాప్, దీపామహాల్ దరి రూ.40 లక్షలు విలువైన ఒకసైట్, సానావీధిలో రూ.15 లక్షల విలువైన ఒక ప్లాట్, నగరంలో రూ.17 కోట్ల విలువ చేసే శ్రీపియ ఖాళీ స్థలంలో వాటా, పెయ్యలవానిపేటలో రూ.60 లక్షల మేర వాటర్‌ప్లాంట్, రూ.45 లక్షల విలువచేసే ప్రస్తుతం కోటివీధిలో వీరి నివాస గృహం, రూ.45 లక్షలు విలువ చేసే అయ్యప్పదేవ్ పార్టనర్ షిప్ స్థలం, నాన్నకు ప్రేమతో సినిమాకు రూ.4.10 లక్షలు, నవమన్మధుడు సినిమాకు రూ.2.40 లక్షల పార్టనర్‌షిప్‌లు వీరికి ఉన్నాయన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి, ఆస్తులపై విచారణ చేపట్టనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఆస్తులను ఆర్ఆర్చట్టం ప్రకారం జప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బుకీల సోదరులను అరెస్టు చేయడంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ దాడి మోహనరావు, సిబ్బంది హెచ్‌సీ రమేష్‌బాబు, ఎల్.జగన్మోహనరావు, పీసీలు కె.మోహనదత్త, కె.రామకృష్ణ, వై.ప్రదీప్, కె.మహేష్‌లను డీఎస్పీ భార్గవరావునాయుడు అభినందించారు.