వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ విజయారావు, వెనుక ముసుగులో ఉన్న నిందితులు
గుంటూరు: తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని గత మూడేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి రూ.7 లక్షల విలువచేసే బంగారు, వెండి వస్తువులతో పాటు చోరీలకు వినియోగించిన ఆటో, ల్యాప్‌ట్యాప్, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పులి వెంకట కాలనీకి చెందిన సైదాపేట రామిరెడ్డి అలియాస్ రాము అలియాస్ డేవిడ్, అతని సోదరుడు శివారెడ్డి అలియాస్ శివ అలియాస్ యేసోబు పగటి సమయంలో ఆటోలో సంచరిస్తూ పాత ఇనుము సామాన్లు కొనుగోలు చేస్తున్నట్టుగా నటిస్తూ తాళాలు వేసి వున్న ఇంటిని గుర్తిస్తారు. రాత్రయ్యాక ఆటోను దూరంగా నిలిపి వెళ్లి వారి వద్ద వున్న పరికరాలతో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతుంటారు. మూడేళ్లకాలంగా ఇదే తంతు కొనసాగుతోంది.
ఈ క్రమంలో ముందస్తు సమాచారంతో నల్లపాడు, సీసీఎస్ పోలీసులు జాతీయ రహదారిపై నిఘా పెట్టడంతో అంకిరెడ్డిపాలెం గ్రామ సమీపంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద వున్న బ్యాగులో పరిశీలించగా బంగారు, వెండి వస్తువులతో పాటు నాలుగు ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నేరాలకు ఉపయోగించే పరికరాలతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గుంటూరు అర్బన్‌లో ఆరు, ప్రకాశంలో రెండు, తిరుపతి అర్బన్‌లో ఒక కేసు నమోదై వుందని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు,సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment