పంట నష్టంపై నేడు నివేదిక
=కలెక్టర్ డెడ్‌లైన్‌తో వేగవంతం
=రబీ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం
=విలేకరులతో జేడీఏ శ్రీనివాసులు
సాక్షి, విశాఖపట్నం: అల్పపీడనం ప్రభావంతో పంట నష్టంపై తుది నివేదికను జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం అందజేయనున్నట్టు వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ సి.ఎన్.శ్రీనివాసులు తెలిపారు. లెక్కింపులో జాప్యంతో ఇటీవల కలెక్టర్ తమకు డెడ్‌లైన్ పెట్టారని, ఆమేరకు మండలాల వారీ జాబితాను శుక్రవారం ఉదయానికి తయారు చేసి అందజేస్తామన్నారు. గురవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనకాపల్లి, మునగపాక, వి.మాడుగుల, కశింకోట, బుచ్చియ్యపేట మినహా మిగిలిన మండలాల్లో లెక్కింపు పూర్తయిందన్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉన్న మండలాల్లోనూ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్టు తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టారని, వారిచ్చే నివేదిక ఆధారంగా వివరాలు తెలుస్తాయన్నారు. చిన్న కమతాల రైతులకూ ఉపయోగపడేలా వ్యవసాయ పరికరాలను అందజేయడానికి ప్రతిపాదనలు రూపొందించామన్నారు. రూ.3.83 కోట్లతో 6923 పరికరాలను పంపిణీకి ప్రణాళిక తయారు చేశామని, ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే అమలు చేస్తామన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు రాయితీశాతం పెరిగే అవకాశం ఉందన్నారు. పనిముట్లు అవసరమైన రైతులు సంబంధిత వ్యవసాయాధికారుల్ని సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు. భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లు, నదుల్లో నీరు పుష్కలంగా ఉందన్నారు. అందువల్ల ఈసారి రబీ సాధారణ విస్తీర్ణం కంటే పెరగనుందని తెలిపారు. జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 36,024హెక్టార్లు, ఈసారి 41,310 హెక్టార్లలో సాగు కావచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 12,331హెక్టార్లలో సాగు చేపట్టారన్నారు.