
రాష్ట్ర విభజనపై మంత్రుల బృందం కీలక సమావేశం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్-జీఓఎం) కీలక సమావేశం నార్త్ బ్లాక్లో ప్రారంభమైంది. రాష్ట్ర విభజన విధివిధాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. రాష్ట్రానికి సంబంధించిన 11 శాఖల సమాచారం సేకరించారు.
పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ - కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ - జల వివాదాలు - యంత్రాంగం సర్ధుబాట్లు - ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి సబ్ కమిటీ - సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణానికి కావలసిన నిధులు - వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీలు - 371వ ఆర్టికల్ సవరణ అంశం - ఉద్యోగుల ముఖ్యమైన సమస్యలు-వివిధ శాఖలు వర్గీకరణ ..... తదితర ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు.
సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీఓఎం దృష్టికి తీసుకువచ్చిన అంశాలను కూడా ఈ సామావేశంలో చర్చిస్తారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం, పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని, కొత్త రాష్ట్రం ఏర్పడితే ఐఐటి, ఐఐఎం... తదితర విషయాలను జీఓఎం దృష్టికి తీసుకువెళ్లారు. వాటన్నిటినీ ఇప్పుడు చర్చిస్తారు.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, గులామ్ నబీ ఆజాద్, వీరప్పమొయిలీ, జైరాం రమేష్, చిదంబరం, నారాయణస్వామి హాజరయ్యారు. ఆంటోనీ గౌర్హాజరు కాలేదు. ఆయన అనారోగ్య కారణంగా హాజరుకాలేదని తెలుస్తోంది.
రాష్ట్ర విభజనకు సంబంధించి విధివిధానాలు నవంబర్ 10 నాటికి పూర్తి చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నట్లు తెలుస్తోంది.