
సాక్షి, అమరావతి: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్) వ్యాప్తిని అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 19 నుంచి 31 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మూసి వేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ఆమె బుధవారం కరోనా వైరస్( కోవిడ్-19)పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నీలం సాహ్ని మాట్లాడుతూ.. అన్ని వసతి గృహాలు మూసివేయాలన్నారు. 10 మందికి మించి ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండకుండా చూడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించేలా ప్రజలందరిలో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. (ఏపీ చొరవ.. విశాఖకు తెలుగు విద్యార్థులు)
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వారు పనిచేసే ప్రాంతంలో తగిన శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకోవాలని నీలం సాహ్ని తెలిపారు. ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ఇంటి నుంచే పనిచేసేలా వెసులుబాటు కల్పించేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో నిరంతరం తగిన శానిటైజేషన్ ప్రోటోకాల్ జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచనలు చేశారు. రైతు బజార్లు, మార్కెట్లు, సంతల్లో అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడ కుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.