‘ఐటీ గ్రిడ్స్‌’ నుంచి 3 హార్డ్‌డిస్క్‌లు మాయం | Cyberabad Police Look Out For IT Grid CEO Ashok | Sakshi
Sakshi News home page

‘ఐటీ గ్రిడ్స్‌’ నుంచి 3 హార్డ్‌డిస్క్‌లు మాయం

Published Tue, Mar 5 2019 3:29 AM | Last Updated on Tue, Mar 5 2019 1:13 PM

Cyberabad Police Look Out For IT Grid CEO Ashok - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్‌ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ దాకవరం అశోక్‌ కీలక సమాచారంతో పరారైనట్లు సైబరాబాద్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. సంస్థ సర్వర్ల నుంచి కీలక సమాచారం డిలీట్‌ చేయడంతోపాటు మూడు హార్డ్‌డిస్క్‌లతో అశోక్‌ ఉడాయించారని భావిస్తున్నారు. దీంతో అశోక్‌ కోసం గాలిస్తున్న సైబరాబాద్‌ పోలీసులు అతను డిలీట్‌ చేసిన సమాచారం రిట్రీవ్‌ చేయడం కోసం సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ అండదండలు ఉన్న నేపథ్యంలో అశోక్‌ ఏపీలోనే తలదాచుకున్నాడని అనుమానిస్తున్నారు. అశోక్‌ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అతని పాస్‌పోర్ట్‌ వివరాలతో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. (డేటా చోర్‌.. బాబు సర్కార్‌)

ఓట్లు తొలగిస్తున్నారంటూ ఫిర్యాదు...
ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై సోమవారం మరో కేసు నమోదైంది. హైదరాబాద్‌ మధురానగర్‌కు చెందిన జి. దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా తయారు చేయించుకున్న ఈ యాప్‌లో ఇతర పార్టీలకు చెందిన వారిని అక్రమంగా ఓటర్‌ లిస్టు నుంచి తొలగించే కుట్ర ఉందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఈ మేరకు ‘సేవామిత్ర’వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. అశోక్, కమలేష్, అబ్దుల్‌ సమా మరికొందరు కలిసి టీడీపీ అనుకూలంగా లేని వారిని టార్గెట్‌ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ ప్రజల వ్యక్తిగత, రహస్య డేటాను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడంతోపాటు యాప్‌లో ఉంచి సర్వే చేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. (ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు)

ఈ యాప్‌ ఉన్న ట్యాబ్‌లతో బూత్‌ స్థాయిలో ఓటర్ల వద్దకు వెళ్తున్న టీడీపీ క్యాడర్‌... ఏపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారిని 10 నుంచి 15 రకాల ప్రశ్నలు అడుగుతున్నారని, ఇలా టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్‌ పేరుతో బెదిరించి వారిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సదరు సంస్థ ప్రయత్నిస్తోందని దశరథరామిరెడ్డి ఆరోపించారు. టీడీపీని వ్యతిరేకించే వారి వివరాలను ఆయా కార్యకర్తలు టీడీపీలోని కీలక వ్యక్తికి పంపిస్తున్నారని, ఈ స్థాయిలో జరిగే కుట్రలో ఆయా వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం ఓట్లు తొలగించడమే కాకుండా వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి ప్రభుత్వ పథకాలు చేరకుండా కుట్ర పన్నుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. (మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు)

దీంతో ఐటీ గ్రిడ్స్‌కు చెందిన నిర్వాహకులపై ఐపీసీలోని 420, 419, 467, 468, 471, 120 (బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. తాజా కేసు నేపథ్యంలో అశోక్‌ను పట్టుకోవడానికి హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రాథమికంగా వారు సేకరించిన సమాచారం ప్రకారం అశోక్‌ విజయవాడ చుట్టుపక్కల తలదాచుకున్నట్లు గుర్తించారు. అతని కోసం రెండు బృందాలు బయలుదేరి వెళ్లాయి. అశోక్‌ను పట్టుకొని అన్ని కోణాల్లోనూ విచారిస్తే ఈ స్కాం వెనుక ఉన్న ఏపీ ప్రభుత్వ, టీడీపీ పెద్దల పేర్లు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. (చంద్రబాబు, లోకేశ్‌ మార్గదర్శనంలో...క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement