మాకు వారం రోజులూ పండుగే.. | Day of the week saw us .. | Sakshi
Sakshi News home page

మాకు వారం రోజులూ పండుగే..

Published Sun, Feb 9 2014 3:43 AM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM

మాకు వారం రోజులూ పండుగే.. - Sakshi

మాకు వారం రోజులూ పండుగే..

  • తల్లులే మా ఇలవేల్పు  
  •  ‘న్యూస్‌లైన్’తో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య
  •   ‘‘రెండేళ్లకోసారి వచ్చే మేడారం జాతర అంటే మాకు వారం రోజుల పండుగ. చుట్టాలు, దగ్గరి మిత్రులను పిలిచి జాతరను ఘనంగా జరుపుకుంటాం.. గిరిజన వనదేవతలు సమ్మక్క, సారలమ్మ తల్లులే మా ఇంటి ఇలవేల్పు.. మా నాయిన వారి పేర్లను కలిపే నాకు సారయ్య అని పేరు పెట్టిండు.. వారి దయతోనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. జాతరలో తల్లుల మహత్యం చాలా గొప్పది. అంత బెల్లం... కోట్లాది మంది భక్తులు వస్తున్నా... గద్దెల వద్ద ఒక్క ఈగ కూడా కనిపించదు.. అదీ సమ్మక్క, సారలమ్మల మహత్యం..’’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య చెప్పుకొచ్చారు. మేడారం మహాజాతరను పురస్కరించుకుని వనదేవతల మహత్యం, తన అనుభవాలు, అభిప్రాయాలను ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే..
     
     వారం వారం దర్శనాలు..

     మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు ఇక నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. వారంవారం దర్శనాలు ఉండేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ప్రతీ వారం పూజారులు అందుబాటులో ఉండడం, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నాం. వారం వారం దర్శనాలతో పాటు ప్రతీ రెండేళ్లకోసారి మహాజాతరను ఘనంగా నిర్వహించాల్సి ఉంటోంది. ఇప్పటికే జాతర ఏర్పాట్లకు రెట్టింపు నిధులు తీసుకొచ్చాం. గత జాతరకు రూ. 60 కోట్లు తీసుకువస్తే... ఈసారి వాటిని రూ.100 కోట్లకు పెంచాం. మేడారం చుట్టూ రహదారులను అభివృద్ధి చేశాం. ఒకప్పుడు ఎడ్లబండ్లలో రెండు రోజులు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎలాంటి వాహనాల్లోనైనా కేవలం రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. చుట్టూర ఉన్న గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు చేశాం. రానున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహిస్తాం.
     
    ప్రత్యేక బడ్జెట్‌తో శాశ్వత ప్రాతిపదికన పనులు చేయిస్తాం. పెద్ద పెద్ద దేవాలయాలకు దీటుగా మేడారంలో పూజలు నిర్వహించేలా చూస్తాం. జంపన్నవాగు వద్ద భక్తులు ఎప్పుడైనా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేయిస్తాం. అక్కడ మినీ రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. తాగునీటి కోసం పెద్ద ట్యాంకులు, మినీ ట్యాంకులు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాం. ఇవన్నీ శాశ్వత పనులే.
     
    తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి..

    సమ్మక్క, సారలమ్మలు అంటే ధీరవనితలు. గుండె ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. ప్రాణత్యాగానికి వెనకాడని నైజం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆ తల్లులే స్ఫూర్తి. ఉద్యమంలో వారిని తలుచుకుంటూ ముందుకు పోయాం. ఇప్పుడు తల్లుల దయవల్లే తెలంగాణ సిద్ధిస్తోంది.
     
     తల్లుల పేరే నాకు..

     మా ఇంటి ఇలవేల్పు సమ్మక్క, సారలమ్మలే కావడంతో వారి పేర్లు కలిసి ఉండేలా నాకు ‘సారయ్య’ అని పేరు పెట్టిండు మా నాయిన. మాకు తల్లులంటే ఎంతో నమ్మకం. ఏ వరం కావాలన్నా... ముందుగా మొక్కేది ఆ తల్లులనే. ఇప్పుడు ఆ దేవతలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. వారి మహత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. కోట్ల మంది వచ్చి బెల్లంగడ్డలు విసిరినా.. అక్కడ (గద్దెల కాడ) ఒక్క ఈగ కూడా వాలదు. బెల్లం ఉన్న చోట ఈగలుంటాయి. కానీ... తల్లుల గద్దెల వద్ద ఒక్కటైనా ఉంటుందా..? అదీ మహత్యం.
     
     ఇంట్లో ఒకటే సందడి..


     మేడారం జాతర వచ్చిందంటే మా ఇంట్లో వారం రోజులపాటు ఒకటే సందడి. మా నాయినకు సమ్మక్క పూనకం ఉండేది. దాంతో మా కుటుంబం మొత్తం జాతరను పెద్ద పండుగగా జరుపుకునేటోళ్లం. మొదటికి(మేడారం) వెళ్లేందుకు సమ్మక్క పున్నం మొదలైనప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకునేటోళ్లం. జాతర మొదలయ్యే రెండు రోజుల ముందే ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్లేవాళ్లం. మధ్యమధ్యలో ఆగి చెట్ల కింద వంటలు చేసుకుని తినేటోళ్లం. కుటుంబం మొత్తం కలిసి ప్రయాణం చేయడం మరిచిపోలేని అనుభూతి. జాతర జరిగే నాలుగు రోజులపాటు మేడారంలోనే ఉండేవాళ్లం. సమ్మక్క, సారలమ్మ తల్లుల సేవలో మా నాయిన తరించేవారు. దేవుడు వచ్చినప్పుడు జంపన్నవాగులో జనాలు నాయిన చుట్టూ చేరి వరాలు కోరుకునేవారు. ఇప్పటివరకు 14 జాతరలు క్రమం తప్పకుండా వెళ్లా. వెళ్లిన ప్రతీసారి మరిచిపోలేని అనుభూతి. గతంలో దట్టమైన అటవీప్రాంతం నుంచి వెళ్లా.. ఇప్పుడు సాఫీగా సాగిపోతున్న రహదారులపై నుంచి కూడా వెళ్తున్నా.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement