సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌సీపీ 72 గంటల, ఏపీ ఎన్జీవోల 48 గంటల బంద్ పిలుపులో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచి కార్యకర్తలు, సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై పాత టైర్లను వేసి తగులబెట్టారు. సీమాంధ్రలో ప్రైవేటు ఆస్పత్రుల బంద్ నిర్వహించారు. వైద్యులు సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర ఠ
నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలు, రైతులు, మహిళలు రహదారులపైకొచ్చి ఆందోళన నిర్వహించారు.
ఇబ్రహీంపట్నంలో జాతీయ రహదారి దిగ్బంధం..
ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్‌సీపీ మైలవరం నియోజకవర్గ సమన్యయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు కిలోమీటర్ల వరకు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు జోగి రమేష్‌ని అదుపులోకి తీసుకుని కొద్దిదూరం తీసుకువెళ్లి వదలివేశారు. ఎన్టీటీపీఎస్ గేటు వద్ద ఉద్యోగులు, కార్మికుల ఆందోళన మరింత ఉధృతమైంది. ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. పెదప్రోలు, మాజేరులో చల్లపల్లిలో వంటావార్పు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో రహదారులపై టైర్లు కాల్చి, వాహనాలను అడ్డుపెట్టి సంపూర్ణ బంద్ పాటించారు. నూజివీడులో నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జంక్షన్ రోడ్డులో తారురోడ్డుపై ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఉయ్యూరు మండలం చిన ఓగిరాల గ్రామస్తులు విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై చెట్లను అడ్డుగా వేసి తగలబెడుతూ వంటావార్పుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉయ్యూరులో సోనియా, షిండే, దిగ్విజయ్ దిష్టిబొమ్మలకు జోరువానలోనూ అంతిమ యాత్ర చేసి, దహన సంస్కారాలు పూర్తి చేశారు.
కంచికచర్ల ప్రాంత ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరంలో టీ నోట్‌కు నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. కైకలూరులో టీడీపీ నేతలు రైలురోకో కార్యక్రమాన్ని చేపట్టారు. కృత్తివెన్నులో వందలాది మంది సమైక్యవాదులు 216 జాతీయ రహదారిపై కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు వారధిపై ఉదయం నుంచే పెద్దసంఖ్యలో చేరి రాస్తారోకో చేశారు. వారధిపైనే సమైక్యవాదులు షిండే, దిగ్విజయ్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. పెడన నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ఉప్పాల రాంప్రసాద్, డాక్టర్ వాకా వాసుదేవరావుల నేతృత్వంలో బందరుకు వెళ్లే బైపాస్ రోడ్డుపై జేఏసీ నాయకులు, వీవీఆర్, ఉప్పాల వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్ సీపీ మహిళా నేత సామినేని విమలాభాను ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలతో నిరసన తెలిపారు.
చిల్లకల్లు-వైరా రహదారి దిగ్బంధం..
జిల్లా సరిహద్దు, ఖమ్మం జిల్లా ప్రవేశం వద్ద చిల్లకల్లు-వైరా రహదారిని దిగ్బంధం చేశారు. సుమారు గంటపాటు చేసిన ఆందోళనలో రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ముండ్లపాడు క్రాస్‌రోడ్స్ వద్ద గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కైకలూరు మండలంలోని ఆటపాక, జాన్‌పేట, గోనెపాడు గ్రామాల రహదారులపై ప్రజలు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. స్థానిక టౌన్‌హాల్ వద్ద జాతీయ రహదారిపై అడ్డంగా రాళ్లతో గోడను కట్టి వంటావార్పు చేపట్టారు. మచిలీపట్నంలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది శనివారం ఓపీని బహిష్కరించి ఆస్పత్రి ఆవరణలో సోనియా, ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర మంత్రులు, కేసీఆర్ చిత్రాలను తగులబెట్టారు. నందిగామ జాతీయ రహదారిపై అంబారుపేట బైపాస్ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. గుడివాడలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. జనార్థనపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు కొండపల్లి కుమార్‌రెడ్డి 48 గంటల రిలేదీక్షను ప్రారంభించారు.
రెండోరోజూ బంద్ సంపూర్ణం
Published Sun, Oct 6 2013 4:33 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement