వెంకటగిరి, న్యూస్‌లైన్: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా అధికార పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. మరికొద్ది నెలల్లో ప్రభుత్వ పదవీకాలం ముగియనుండటంతో నాలుగు కాసులు సంపాదించుకునేందుకు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరవుతున్న నిధులు వారికి వరంగా మారాయి. అవసరం ఉన్నా లేకున్నా నాసిరకంగా రోడ్లు నిర్మించేసి ప్రజల సొత్తును జేబులో వేసుకుంటున్నారు. ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాల్సిన అధికారులు వారికి వంతపాడుతుండటం విమర్శలకు తావి స్తోంది. అదే సమయంలో సమస్యలకు నిలయంగా మారిన దళిత, గిరిజన కాలనీ లను విస్మరిస్తున్నారు. వెంకటగిరి నియోజవర్గంలో నెలకొన్న పరిస్థితి ఇది. డక్కిలి మండలం దగ్గవోలు పంచాయతీలోని శ్రీరాంపల్లి ఎస్టీకాలనీ, రేగడపల్లి ఎస్సీకాలనీల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం రూ.13 లక్షలు మంజూరు చేసింది.
ఈ నిధుల్లోని రూ.3 లక్షలతో శ్రీరాంపల్లి ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేశారు. ఒక వీధిలో 8 ఇళ్లు, మరోవీధిలో ఒకే ఇల్లు ఉన్నా నిధులను ఎలాగైనా వినియోగంచాలనే ఉద్దేశంతో హడావుడిగా సిమెంట్ రోడ్డు నిర్మించారు. మరో రూ.10 లక్షలతో రేగడిపల్లి దళితకాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. ఇక్కడ మూడు వీధుల్లో రోడ్లు నిర్మించగా ఒక వీధిలో ఇళ్లే లేకపోవడం గమనార్హం. వీటి నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ కరువవడంతో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారింది.
నాసిరకమైన కంకరను వినియోగించి రోడ్లను నిర్మించడంతో అవి అప్పుడే నెర్రెలు బారుతున్నాయి. రేగడిపల్లిలో ప్రస్తుతం జరుగుతున్న డ్రైన్ల నిర్మాణం కూడా నాసిరకంగా సాగుతోంది. పదికాలాల పాటు ఉండాల్సిన రోడ్లు ముణ్నాళ్ల ముచ్చటగా మారుతుండటంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణం జరుగుతున్న తీరును పంచాయతీ రాజ్ అధికారుల వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా తాము సమ్మెలో ఉన్నామని సమాధానం ఇచ్చారు.
‘దారి’ మళ్లుతున్న ‘ఉపాధి’ నిధులు
Published Thu, Oct 17 2013 4:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement