సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారును ఎవరు వెనకేసుకొచ్చారన్న విషయంపై మంగళవారం శాసన సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. కాంగ్రెస్‌ను వెనకేసుకొస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంపై చేసిన విమర్శలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గత పదేళ్లలో రాష్ట్రం బాగా వెనక్కు వెళ్లిపోయింది. ఉద్యోగాలు పోయాయి. సంస్థలను భ్రష్టుపట్టించారు. అలాంటి కాంగ్రెస్‌ను వెనకేసుకొస్తున్నారా’ అంటూ ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. బాబు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘రాష్ట్రంలో అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు రైతులపై రూ.34 వేల కోట్ల విద్యుత్ భారం వేస్తే, ప్రజల పక్షాన పోరాడేందుకు అన్ని రాజకీయ పక్షాలతో కలసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఆ ప్రభుత్వాన్ని గట్టెక్కించింది మీరు కాదా’ అని అధికార టీడీపీని నిలదీశారు.
మీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి, అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటెయ్యాలని చెప్పి, ఆ ప్రభుత్వాన్ని గట్టెక్కించారా లేదా అని ప్రశ్నించారు. ఆరోజు మీరు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపి ఉంటే ఈరోజు రాష్ట్రం విడిపోయేదే కాదని చెప్పారు. దీన్నిబట్టి కాంగ్రెస్‌కు అంటకాగుతున్నది ఎవరని ప్రశ్నించారు. ఆ నెపాన్ని ఇప్పుడు ఇతర పార్టీలపై మోపడం సిగ్గుచేటని అన్నారు. పాలకపక్షాన్ని ప్రతిపక్ష పార్టీ గట్టెక్కించడం చరిత్రలో ఇదే తొలిసారి అయి ఉండవచ్చని అన్నారు.
ఈ సందర్భంలో అధికార టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర జోక్యం చేసుకుంటూ..‘మీ ప్రయోజనాల కోసం మేమెందుకు ప్రభుత్వాన్ని పడగొట్టాలి? అయినా మీ పార్టీ సభ్యులకు మేమేమైనా విప్ ఇచ్చామా? మా పార్టీ సభ్యులకే విప్ ఇచ్చాం’ అంటూ సమర్థించుకున్నారు. దానిపై జగన్ స్పందిస్తూ.. ‘సభ సాక్షిగానే మీ సభ్యులు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు దిగిపోకుండా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మద్దతునిచ్చామని చెబుతున్నారు. మా సభ్యులకు మేము విప్ జారీ చేస్తే మీకేం అని అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే మీరు కిరణ్ సర్కారుకు మద్దతునిచ్చాం అని ఒప్పుకుంటున్నట్టే కదా’ అని చురక అంటించారు. కోట్లాది రైతులు విద్యుత్ చార్జీలు చెల్లించలేక దిక్కులేని స్థితిలో ఉంటే అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా చంద్రబాబు వారి పక్షాన పోరాడాల్సింది పోయి, పాలకపక్షానికి మద్దతివ్వడంకంటే దారుణం మరొకటి లేదని జగన్ ధ్వజమెత్తారు.