రుణమాఫీ.. అయితేనే హ్యాపీ | Debt waiver scheme is better then happy | Sakshi
Sakshi News home page

రుణమాఫీ.. అయితేనే హ్యాపీ

Published Fri, May 30 2014 3:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రుణమాఫీ..   అయితేనే హ్యాపీ - Sakshi

రుణమాఫీ.. అయితేనే హ్యాపీ

‘దాళ్వా గట్టెక్కిందన్న మాటే గానీ.. ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు ఖర్చులకు సరిపోరుంది. చేతిలో చిల్లిగవ్వ మిగల్లేదు. తొలకరి సీజన్ వచ్చేస్తోంది. వారం పది రోజుల్లో పొలం దున్నాలి. నారు పోయూలి. మొన్నటివరకూ చేసిన అప్పులు ఇంకా తీరలేదు. కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కనిపించట్లేదు. చంద్రబాబు రుణమాఫీ చేస్తామంటే నమ్మి ఓటేశాం.

 బ్యాంకోళ్ల దగ్గరకు పోతే మాఫీ సంగతి తమకేమీ తెలియదంటున్నారు. కొత్త అప్పు ఇమ్మంటే.. పాత అప్పు కడితే గాని ఇచ్చేది లేదంటున్నారు. తొలకరి పంట ఎలా వేయూలో అర్థం కావట్లేదు...’ ఏ రైతును కదిపినా ఇదే మాట వినిపిస్తోంది. వ్యవసాయ రుణాల మాఫీపై కోటి ఆశలు పెట్టుకున్న అన్నదాతలు ఆ తీపి కబురు ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూస్తున్నారు.
 
- అప్పుల ఊబిలో అన్నదాతలు విముక్తి కోసం ఎదురుచూపులు
- వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు
- నేటికీ విడుదల కాని మార్గదర్శకాలు
- ఈ నెలాఖరుతో ముగుస్తున్న చెల్లింపుల గడువు

 
 సాక్షి,  నాలుగేళ్లపాటు ప్రకృతి వైపరీ త్యాలతో పంటలు కోల్పోయిన రైతులు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణమాఫీ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో దాదాపు 14,55,030 ఖాతాల ద్వారా రూ.11 వేల 848 కోట్లను వ్యవసాయ రుణాలుగా తీసుకున్న అన్నదాతలు అవి మాఫీ అయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ నెలాఖరులోపు రుణమొత్తాలను తిరిగి చెల్లించాలని బ్యాంకర్లు చెబుతున్నారు. లేదంటే కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకూ రుణమాఫీకి సంబంధించి తమకు ఎలాం టి మార్గదర్శకాలు అందలేదంటున్నారు. మరోవైపు సార్వా సీజన్ ముంచుకొస్తోంది. ఈ పరిస్థితుల్లో రుణమాఫీ అవుతుందా.. లేదా.. కొత్త రుణాలు వస్తాయా.. రావా? అనే అనుమానాలు, ఆందోళనలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి.

వేటికి వర్తిస్తుందో మరి
జిల్లాలో ఏటా దాదాపు 2 లక్షల మంది రైతులు 36 బ్యాంకుల నుంచి వ్యక్తిగతంగా ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.80 వేల చొప్పున వ్యవసాయ రుణం పొందుతుంటారు. ఖరీఫ్, రబీ సీజన్ల ప్రారంభంలో పంట రుణాలు, వ్యవసా య ఖర్చుల కోసం ఏడాది పొడవునా బంగారం హామీపై రుణాలు, వ్యవసాయ భూమిపై స్వల్పకాలిక రుణాలు ఇస్తుంటారు. వ్యవసాయ పరికరాలు, యంత్రాల కొనుగోలుకు తీసుకునే రుణాన్ని టెర్మ్‌లోన్‌గా పిలుస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ దాదాపు రూ.12వేల కోట్ల మేర రైతులు రుణాలు తీసుకున్నారు. వీటిలో వేటికి రుణమాఫీ వర్తిస్తుందనేది ప్రస్తుతానికి సమాధానం దొరకడం లేదు.

గడువు ముగిసిపోతే...
వ్యవసాయ రుణాలను తిరిగి చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకూ మాత్రమే గడువు ఉంది. గడువు దాటితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వడ్డీ రాయితీలు రైతులకు అందవు. ప్రస్తుతం 9 శాతం వడ్డీకి బ్యాంకులు వ్యవసాయ రుణాలిస్తున్నాయి. ఇందులో 2 శాతం సాధారణంగా, 3 శాతం సక్రమ చెల్లింపుదారులకు మొత్తంగా 5 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది.

సక్రమ చెల్లింపుదారుల తరపున మిగిలిన 4 శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. దీంతో వడ్డీ లేని రుణం రైతుకు లభించినట్టవుతోంది. కానీ గడువు ముగిసిపోతే కేంద్రం ఇచ్చే 2 శాతం మినహా మిగిలిన 7శాతం వడ్డీని రైతులే భరించాలి. కొంతకాలం గడువు తర్వాత 10.50 శాతం వడ్డీ పడుతుంది. దీంతో రైతులు భయపడుతున్నారు.

రుణమాఫీపై నమ్మకంతో రైతులు తీసుకున్న మొత్తాన్ని చెల్లించకపోతే వడ్డీల భారం మోయాలి. అలాగని బాకీ చెల్లించిన తరువాత రుణాలను మాఫీచేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ పరిస్థితుల్లో రుణాలు కట్టాలో, లేదో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు.
 
మార్గదర్శకాలు రాలేదు
వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. వాస్తవానికి రైతులు ఈ నెలాఖ రులోపు రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. మాఫీ అవుతాయనే ఆశతో ఎవరూ బకాయిలు చెల్లించడం లేదు. నిబంధనల ప్రకారం బ్యాంకులు తమపని చేసుకుపోతాయి. కొత్త రుణాల మంజూరుపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో తీసుకున్న రుణం చెల్లించిన వారికే కొత్తగా రుణం లభించే అవకాశం ఉంది.
 - ఎం.లక్ష్మీనారాయణ, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్
 
వేయి క ళ్లతో ఎదురు చూస్తున్నాం
 సార్వాలో వ్యవసాయ పెట్టుబడుల కోసం ఆచంట మృత్యుంజయ సహకార బ్యాంకులో పొలం తనఖా పెట్టి రూ.40 వేలు అప్పు తీసుకున్నాను. దాళ్వాలో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. అప్పులు మిగిలాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. రుణమాఫీ కోసం వేయి క ళ్లతో ఎదరు చూస్తున్నాం.                                   - తమ్మినీడి సూర్యనారాయణ, ఆచంట  

తక్షణమే రుణమాఫీ చేయూలి
 నగలు తనఖా పెట్టి వ్యవసాయ పెట్టుబడి కోసం రూ.లక్ష అప్పు తీసుకున్నాను. ఈ మధ్యన కురిసిన అకాల వర్షం వల్ల నష్టపోయాను. ఐదు ఎకరాల మీద దాదాపు రూ.30 వేల నష్టం వచ్చింది. ఏం చేయాలో పాలుపోవడంలేదు. రుణమాఫీ చేస్తే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదు. తక్షణమే రుణమాఫీ చేయూలి.
 -పూసల నాగ్వేరరావు, ఆచంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement