శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో విద్యా రంగం ఎటువైపు పయనిస్తుందో అర్థం కావడం లేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ఊతమిచ్చేలా పలు చర్యలు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వంలోని కార్పొరేట్లు విద్యా రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు చూస్తుంటే సంఘాల ఆరోపణల్లో వాస్తవం ఉందని అంగీకరించక తప్పడం లేదు.
మోడల్ స్కూళ్లలో తగ్గుతున్న సరస్వతీ పుత్రులు
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు సత్ఫలితాలు ఇవ్వడంలేదు. శ్రీకాకుళం జిల్లాలో 14 మోడల్ స్కూళ్లున్నాయి. వీటన్నింటిలోనూ ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. కొత్తగా ఏ ఒక్కరూ చేరడం లేదు. మోడల్ స్కూళ్లలో ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ కూడా ప్రవేశపెట్టినప్పటికీ ఎవరూ చేరడం లేదు. ఈ స్కూళ్లలో వసతి సౌకర్యం కల్పించాల్సి ఉన్నా ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం వల్ల ఇప్పటివరకు కొంతమేర విద్యార్థులు వచ్చారు.
ఈ ఏడాది మోడల్ స్కూళ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేయడంతో ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నాయి. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు అందకపోవడం, సర్వీసు రూల్స్ లేకపోవడంతో పలువురు ఉపాధ్యాయులు గతంలో పనిచేసిన యాజమాన్యాల పాఠశాలలకు వచ్చేస్తుండగా, కొత్తగా ఎంపికైనవారు తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది కొత్తగా నియామకాలు చేపట్టకపోవడంతో కాంట్రాక్ట్ పద్ధతిన విద్యా వలంటీర్ల తరహాలో ఉపాధ్యాయ, అధ్యాపకులను సమకూర్చుకుంటున్నారు. మోడల్ స్కూళ్లు మారుమూల ప్రాంతాల్లో నిర్మించడంతో సరైన రవాణా సౌకర్యాలు లేక విద్యార్థులు మానేస్తున్నారు.
కేజీబీవీలకు విద్యార్థులు పెరుగుతున్నా చేర్చుకోలేని వైనం
కసూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులు చేరేందుకు సుముఖంగా ఉన్నా వారిని చేర్చుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి తరగతిలోనూ 60 మందిని మాత్రమే చేర్చుకునే అవకాశం ఉంది. దీంతో పలు కేజేబీవీలకు వస్తున్న విద్యార్థినిలను వెనక్కి పంపించేస్తున్నారు. ఈ ఏడాది నుంచి కేజీబీవీల్లో ఆంగ్ల మాంధ్యమాన్ని ప్రవేశపెట్టడం, వచ్చే ఏడాది నుంచి శతశాతం ఆంగ్ల మాంధ్యమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేజీబీవీల్లో చేరే విద్యార్థినులు రెగ్యులర్ విద్యార్థులు కారు. డ్రాపౌట్లు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు లేనివారు, వలస కూలీల పిల్లలను కేజీబీవీల్లో చేర్చుకుంటారు. ఇటువంటి వారు ఆంగ్ల మాంధ్యమాన్ని చదివే అవకాశాలు తక్కువ. అయినప్పటికీ పాఠశాలల్లో చేరేందుకు వస్తున్నా చేర్చుకునే అవకాశం లేకుండా ప్రభుత్వం చేస్తోంది.
పాఠశాలల విలీనం చేపడితే మరింతగా డ్రాపౌట్లు
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకటి రెండు నెలల్లో ఇది కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే విద్యార్థులు ప్రాథమిక విద్య కోసం కిలోమీటరు, ఉన్నత విద్యకు మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంతటి ప్రయాసతో బడికి పంపించే అవకాశాలు తక్కువ. దీంతో డ్రాపౌట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. విలీనంపై ప్రభుత్వం సర్వే చేయించినప్పుడు 20 శాతం బాలురు, 50 శాతం బాలికలు డ్రాపౌట్లుగా మారుతారని తేలింది. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా విలీనం చేయాలని నిర్ణయించడం ఆక్షేపణలకు తావిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో పలువురు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు అటుగా దృష్టి సారిస్తున్నారు.
పయనం ఎటువైపు?
Published Fri, Jun 19 2015 1:03 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement