కూత ఘనమేనా..
- కొత్త జోన్‌కు‘పచ్చజెండా’?
- రైల్వే బడ్జెట్‌పై కోటి ఆశలు
- కొత్త రైళ్లు సాకారమయ్యేనా?
రైల్వే బడ్జెట్‌పై విశాఖ ఆశలు పెట్టుకుంది. మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే మొదటి రైల్వే బడ్జెట్‌లో ఉత్తరాంధ్రకు ఎలాంటి వరాలిస్తుందోనని ఎదురు చూస్తున్నారు. విశాఖ నుంచి బీజేపీ ఎంపీని గెలిపించడంతో ఈ ఆశలు మరింత రెట్టింపు అయ్యాయి. బీజేపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్టుగా వాల్తేరుకు ఎంత ప్రాధాన్యమిస్తారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
విశాఖపట్నం : గత ప్రభుత్వాలన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వానిది మరో ఎత్తుగా అభివర్ణిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖను రైల్వే జోన్ కేంద్రంగా ప్రకటిస్తారన్న ఆశలతో ఉత్తరాంధ్ర వాసులున్నారు. అయితే మంగళవారం ప్రకటించే బడ్జెట్ ప్రసంగంలో మాత్రం కొత్త జోన్ ప్రస్తావన మాత్రమే తప్ప జోన ల్ కేంద్రం ఎక్కడనేది రైల్వే మంత్రి సదానందగౌడ ప్రకటించకపోవచ్చని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీ నుంచి వర్తమానం అందినట్టు తెలిసింది. రైల్వేజోన్ ప్రకటన మాటెలా వున్నా విశాఖకు రైల్వే పరంగా ఎలాంటి వరాలు వస్తాయోనని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
వ్యాగన్ వర్క్‌షాప్ :
అగనంపూడి వద్ద వ్యాగన్ వర్క్‌షాపు వచ్చేందుకు ఛాన్స్‌లున్నాయి. ఒడిశాకు తరలిపోయిన ఈ ప్రాజెక్టును మళ్లీ విశాఖకు రప్పించడానికి రైల్వే బోర్డు యత్నిస్తోంది. ఒడిశాలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే విశాఖలో మూడో వంతు ఖర్చుతోనే నిర్మాణాలన్నీ పూర్తి చేయొచ్చని అంటున్నారు. ఈ ప్రాజెక్టు వస్తే ఉత్తరాంధ్రలోని 3-4 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభించే అవకాశముంది. మరో రెండు వేల మందికి ఉపాధి లభ్యం కావొచ్చు.
కొత్త రైళ్ల కూత..!
రాష్ట్ర విభజన తర్వాత వచ్చే మొదటి రైల్వే బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానికి రాష్ట్ర నలుమూలల నుంచి కొత్త రైళ్లు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీకి కూడా పలు కొత్త రైళ్లను ప్రకటించనున్నారు. అన్ని జిల్లాలకు కనెక్టవిటీ పెరగాలంటే అందుకు ఉపయోగపడే ప్యాసింజర్ రైళ్లను విరివిగా ఏర్పాటు చేయొచ్చని భావిస్తున్నారు. అందుకే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు బడ్జెట్‌లో వుండొచ్చని భావిస్తున్నారు.
విశాఖ-ఢిల్లీకి దురంతో ఎక్స్‌ప్రెస్
విశాఖ-తిరుపతికి రాయలసీమ ఎక్స్‌ప్రెస్
విశాఖ-చెన్నైకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
రోజూ నడపాల్సిన రైళ్లివే..
ప్రస్తుతం ఈ రైళ్లు వారానికో రోజు నడుస్తున్నాయి. ఈ రైళ్లన్నీ నిత్యం రద్దీగా నడుస్తున్నాయి. వీటిని రోజూ నడపాలన్న డిమాండ్ ఉంది. కనీసం వారానికో మూడు రోజులైనా ఫ్రీక్వెన్సీ పెంచి నడపాలని కోరుతున్న రైళ్లు ఇవి.
విశాఖ-చెన్నై
విశాఖ-షిర్డీ
విశాఖ-గాంధీధాం
విశాఖ-జోధ్‌పూర్
విశాఖ-కొల్లాం
ప్యాసింజర్లు వచ్చే ఛాన్స్...!
ఇచ్చాపురం-కాకినాడ
పలాస-చిత్తూరు విజయవాడ మీదుగా
విశాఖ-గుంటూరు