వామ్మో.. డెంగీ | dengue deaths in proddatur | Sakshi
Sakshi News home page

వామ్మో.. డెంగీ

Published Sat, Oct 21 2017 6:30 AM | Last Updated on Sat, Oct 21 2017 6:30 AM

dengue deaths in proddatur

దోమలకు నిలయంగా స్వయంసేవక్‌ రోడ్డు

డెంగీ పేరు చెబితేనే ప్రజలు హడలిపోతున్నారు. అయితే మున్సిపల్‌ అధికారులు ఆస్పత్రుల్లో ఎలాంటి డెంగీ కేసులు నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలువురు డెంగీ జ్వరంతో మృత్యువాత పడినా జిల్లా యంత్రాంగం మేలుకోకపోవడం వారి నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది.

ప్రొద్దుటూరు టౌన్‌ : ప్రొద్దుటూరులో రెండేళ్ల కిందట డెంగీ బారినపడి పదుల సంఖ్యలో మృత్యువాత పడిన పరిస్థితులు ఇప్పుడు పుణరావృతం అవుతున్నాయా అన్నట్లు ఉంది పరిస్థితి. పట్టణంలోని స్వయంసేవక్‌రోడ్డులో చంద్రశేఖర్‌కు టుంబంలో కుమార్తె సోనిక(12) వారం రోజుల కిందట జ్వరం రావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. 1.20 లక్షలు ఉన్న రక్తకణాలు 40 వేలకు తగ్గడంతో వైద్యుని సలహామేరకు కర్నూలు రెయిన్‌బో ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికీ దాదాపు రూ.60 వేల నుంచి రూ.70 వేల దాకా వైద్యానికి ఖర్చయింది. డెంగీ పాజిటివ్‌ అని రక్త పరీక్షల రిపోర్టులో ఇచ్చారు. ఇతని కుమారుడు చరిత్‌(10)కు జ్వ రం రావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. రక్త కణాలు తగ్గడంతో పరీక్షలు చేయి స్తే ఇతనికి డెంగీ పాజిటివ్‌గా రిపోర్టు ఇచ్చారు. వైద్యానికి రూ.40 వేలకు పైగా ఖర్చయింది. చిన్న వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఇతను పిల్లలు ఇద్దరికీ డెంగీ రావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

రక్తకణాలు 4 వేలకు తగ్గడంతో...
చంద్రశేఖర్‌ అన్న మల్లికార్జున చిన్న కుమార్తె ప్రణవి(9)కి ఈ నెల 10వ తేదీ జ్వరం వచ్చింది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గలేదు. రక్త పరీక్షలు చేయించారు. రక్తకణాలు 9000 ఉన్నట్లు గుర్తించారు. మరో రెండు రోజులు చికిత్స చేయించాక చూస్తే 4000లకు రక్తకణాలు పడిపోయాయి. అప్పటికే ప్రణవి శరీరం వాపు వచ్చింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అంబులెన్స్‌లో ఆక్సిజెన్‌ ఏర్పాటు చేసుకొని  కర్నూలు ఆస్పత్రికి పరుగులు తీశారు. అక్కడికి వెళితే బెడ్‌లు ఖాళీగా లేవు, పరిస్థితి విషమంగా ఉంది హైదరాబాదుకు వెళ్లమన్నారు. మల్లికార్జున పరిస్థితి దయనీయంగా మారింది. కన్నబిడ్డ ప్రాణం కాపాడుకోవడానికి అటునుంచి అటే హైదరాబాదుకు బయలు దేరారు. లోటస్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఐదు రోజులు ఐసీయూలో ఉంచారు. దాదాపు రూ.2లక్షలకు పైగా వైద్యానికి ఖర్చు చేశారు. తెలిసిన వారి వద్ద నుంచి డబ్బు తెప్పించుకొని శుక్రవారం తెల్లవారుజామున ప్రణవిని ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు.

మరో రెండు డెంగీ కేసులు నమోదు...
పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయని శుక్రవారం మున్సిపల్‌ అధికారులకు నివేదికలు వచ్చాయి.  పలు ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో రక్త కణాలు పూర్తి స్థాయిలో పడిపోయిన కేసులు ఉన్నా వారి వివరాలను వైద్యులు మున్సిపల్‌ అధికారులకు ఇవ్వడంలేదు. రోజూ ఐదు, ఆరు మంది కర్నూలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

జిల్లాలో పలువురు మృతి...
జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలోని సుద్దపల్లె గ్రామానికి చెందిన బుచ్చనపల్లె నాగమ్మ(45) జ్వరం బారిన పడి మృతి చెందింది. అలాగే గువ్వలచెరువు, నీలకంఠరావుపేట, బండపల్లె రాచపల్లె తదితర గ్రామాల్లో కూడా ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. రాయచోటి పట్టణానికి చెందిన నీలా ప్రభు(15) అనే విద్యార్థి విష జ్వరంతో మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లె మండలం ముర్రిచెట్టు సమీపంలో నివాసం ఉంటున్న కీర్తి(8) అనే బాలిక విషజ్వరంతో మృతి చెందింది. రామాపురంలోని మూడు రోడ్ల కూడలి వద్ద అనుంపల్లెకు చెందిన సరోజమ్మ (50) విషజ్వరంతో మృతి చెందింది. మైదుకూరు పట్టణం కడప రోడ్డులో నివాసం ఉంటున్న కె.వనజ (17) డెంగీ జ్వరంతో మృతి చెందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement