దడపుట్టిస్తున్న డెంగీ | Dengue Fever Attack On Vijayawada People | Sakshi
Sakshi News home page

దడపుట్టిస్తున్న డెంగీ

Published Fri, Sep 7 2018 2:03 PM | Last Updated on Fri, Sep 7 2018 2:03 PM

Dengue Fever Attack On Vijayawada People

కృష్ణాజిల్లా, అవనిగడ్డ: నిన్నటి వరకు పాముకాట్లతో వణికిన దివిసీమను నేడు  డెంగీ జ్వరాలు భయపెడుతున్నాయి. చల్లపల్లి, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక మండలాలకు చెందిన 8 మంది డెంగీ లక్షణాలతో బాధపడుతూ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. అవనిగడ్డ మండల పరిధిలోని కొత్తపేటకు చెందిన మద్దాల శేషుబాబు జ్వరంతో నాలుగు రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వెళ్లాడు. రక్తపరీక్ష అనంతరం అతనికి డెంగీ లక్షణాలు బయట పడ్డాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం రెండు రోజుల క్రితం ఆయనను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. స్థానిక 8వ వార్డుకు చెందిన సాలా నాగరాజుకు పది రోజుల క్రితం జ్వరం రావడంతో అవనిగడ్డ వైద్యశాలలో చికిత్స పొందాడు. తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స చేస్తున్నా తగ్గకపోవడంతో పరీక్షలు నిర్వహించారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయినట్లు గుర్తించి బుధవారం ప్లేట్‌లెట్స్‌ ఎక్కించారు. వీరితో పాటు అవనిగడ్డకు చెందిన మరొకరు, చల్లపల్లి మండలంలో ముగ్గురు, మోపిదేవి, నాగాయలంక మండలంలో ఒక్కొక్కరు చొప్పున డెంగీ లక్షణాలతో విజయవాడ, గుంటూరు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. విషజ్వరాలు, మలేరియా జ్వరాలతో బాధపడుతున్న కొంతమందికి ప్లేట్‌లెట్స్‌ పడిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు.

విజృంభిస్తున్న విషజ్వరాలు
దివిసీమలో రోజురోజుకీ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం చల్లపల్లి, అవనిగడ్డ, నాగాయలంకలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు జ్వర పీడితులతో నిండిపోయాయి. స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో గురువారం 22 జ్వరాల కేసులు నమోదయ్యాయి. వీరిలో 17మంది మహిళలు ఉన్నారు. వీటిలో విష జ్వరాల కేసులు 20, 2 టైఫాయిడ్‌ కేసులు ఉన్నాయి. స్థానిక పంచా యతీ పరిధి 8వ వార్డులోని ఎస్టీ కాలనీలో విష జ్వరాల బాధితులు బాగా పెరిగిపోయారు. ఈ ప్రాంతానికి సమీపంలో డంపింగ్‌యార్డు ఉండటం, నివాసాల మధ్య పందులు పెంచడం, ము రుగు నిల్వ ఉండటం వల్ల విష జ్వరాల కేసులు  పెరిగాయి. ఈ కాలనీలో సు మారు 20 మంది వరకు విష జ్వరాలతో బాధపడుతున్నారు. చల్లపల్లి పంచాయతీ పరిధి ఎస్సీ బా లికల వసతిగృహం పక్కనున్న దళితవాడలో 24 విష జ్వరాల కేసులు నమోదు కావడంతో ఈ ప్రాంతంలో గురువారం ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. 

భయపడవద్దు
నాలుగు రోజుల నుంచి జ్వరాల కేసులు పెరిగాయి. జ్వరం వచ్చి ప్లేట్‌లెట్స్‌ తగ్గితే డెంగీ జ్వరం అని కొంతమంది భయపడుతున్నారు. ప్లేల్‌లెట్స్‌ తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈరోజు వచ్చిన కేసుల్లో 20 విషజ్వరాలు, రెండు టైఫాయిడ్‌ కేసులున్నాయి.  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమల బారిన పడకుండా రక్షణ చర్యలు, కాచి చల్లార్చిన నీటిని తాగితే జ్వరాలు రాకుండా రక్షణ పొందవచ్చు.– డాక్టర్‌ కృష్ణదొర, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఏరియా వైద్యశాల, అవనిగడ్డ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement