గత సర్కారు అనుమతించిన రూ.300 కోట్ల పనుల నిలిపివేత
ఏపీ సీఎం కార్యాలయం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తొలి వేటు వేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఫిబ్రవరి నెలలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 13 జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి మంజూరు చేసిన పనులను, నిధులు విడుదలను నిలుపుదల చేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కిరణ్ సర్కార్ మంజూరు చేసిన రూ. 300 కోట్ల నిధులు విడుదల, పనులు నిలిచిపోనున్నాయి.
ఇందులో పీలేరు నియోజకవర్గ అభివృద్ధికి కిరణ్‌కుమార్‌రెడ్డి మంజూరు చేసిన రూ. 80 కోట్ల విలువైన పనులు ఉన్నాయి. ఇప్పటివరకు పనులు ఎక్కడ వరకు జరిగితే అక్కడే నిలిపేయాలని, తదుపరి పనులు చేయపట్టవద్దని, అలాగే నిధులను విడుదల చేయవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రణాళికా శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.