మంత్రి పదవి ఉమాకే చాన్స్
*తొలి విడత ఒక్కరికే అవకాశం
*మలివిడతలో మిగిలిన వారి పేర్ల పరిశీలన
*రేసులో మండలి, కాగిత
సాక్షి, విజయవాడ : సీమాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారానికి సమయం దగ్గరపడుతుండడంతో మంత్రి పదవి ఆశిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనని పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో అవకాశం కల్పించడంపై చంద్రబాబు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది.
జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం కల్పిస్తారని తొలుత ప్రచారం జరిగినా.. తొలి విడత ఒక్కరినే మంత్రి పదవి వరించే వీలుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుకు అమాత్య పదవి దక్కనుంది. ఆయన ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పశ్చిమ కృష్ణా నుంచి ఉమకు అవకాశం కల్పిస్తున్నందున.. తూర్పు కృష్ణాకు మరో మంత్రి పదవి ఇవ్వాలని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కోరుతున్నారు. తొలివిడతలో ఉమకు అవకాశం ఇచ్చి, తర్వాత జరిగే విస్తరణలో తూర్పుకృష్ణా నుంచి ఇంకొకరికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సామాజిక సమీకరణలు..
చంద్రబాబు సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పశ్చిమకృష్ణా నుంచి దేవినేని ఉమకు ఇస్తే.. తూర్పు కృష్ణా నుంచి బీసీ, కాపులలో ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవారికి చంద్రబాబు మంత్రివర్గంలో చోటిస్తారా.. లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది.
అలా ఇచ్చినట్లయితే మాజీ మంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు అవకాశం లభిస్తుంది. కేవలం పార్టీలోని సీనియర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌కు మంత్రి పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటుకోసం ప్రయత్నించినా.. తొలి విడత మంత్రివర్గం పరిమితంగా ఉంచాలని చంద్రబాబు భావించడంతో వీరంతా ఆశ వదులుకున్నట్లు సమాచారం.