
'డీజీపీగా దినేష్ రెడ్డి ను కొనసాగించలేము'
హైదరాబాద్:డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా దినేష్ రెడ్డి కి క్యాట్ లో చుక్కెదురైంది. తన పదవీ కాలాన్ని మరింత పొడిగించాంలంటూ డీజీపీ క్యాట్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం విచారించిన క్యాట్ డీజీపీ అభ్యర్థనను తిరస్కరించింది. డీజీపీ గా ఇక కొనసాగించలేమని రాష్ట్ర ప్రభుత్వం క్యాట్ కు నివేదిక ఇవ్వడంతో దినేష్ రెడ్డి పెట్టుకున్న ఆశలకు గండిపడక తప్పలేదు. సెప్టెంబర్ 30, 2014 వరకూ తన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ డిజిపి దినేష్ రెడ్డి క్యాట్ హైదరాబాద్ బెంచిని ఆశ్రయించారు.
'ప్రకాష్ సింగ్ తదితరులు - భారత ప్రభుత్వం తదితరుల' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా డిజిపిగా తన నియామకం జరిగిన తేదీ నుంచి రెండేళ్ళపాటు పదవిలో కొనసాగేలా అవకాశమివ్వాలని దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది.