
సాక్షి, పోలాకి: రాష్ట్రంలో ఇకపై చంద్రబాబు అండ్ కో కుట్రలు సాగనివ్వబోమని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వారి ఆలోచనలు కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా కన్పిస్తున్నాయని ఆరోపించారు. ఆదివారం మబగాం క్యాంప్ కార్యాలయం నుంచి మంత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆఖరికి టీడీపీ విమర్శలు చేయడానికి మాత్రమే పనికొచ్చే పార్టీగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రాథమిక కార్యాచరణ లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందంటూ విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటివరకూ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కనీస స్పందన లేని నాయకులుగా వారికి పదవుల్లో వుండే అర్హత లేదన్నారు.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగిస్తే రాష్ట్రంలో యాక్షన్‌ప్లాన్‌తో సిద్ధంగా వున్నామని తెలిపారు. క్షేత్రస్ధాయిలో వలంటీర్లు, వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందితోపాటు ఇతర వ్యవస్ధలు చేపడుతున్న చర్యలు అద్భుతమని మంత్రి కృష్ణదాస్ కొనియాడారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో వుంచి వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నాలుగు కోవిడ్ ఆసుపత్రులు, పదుల సంఖ్యలో క్వారంటైన్ సెంటర్లు సిద్ధం చేసి వుంచామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment