
వ్యాధిపై ఆరా తీస్తున్న జిల్లా అధికారులు
శ్రీకాకుళం, జి.సిగడాం: మండలం మెట్టవలస గ్రామంలో డయేరియా పంజా విరిసిరింది. ఒకేసారి 52 మందికి వ్యాధి వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో తోండ్రోతు వైకుంఠం, తోండ్రోతు కన్నారావు, పరశురాం, ఎడ్ల స్వాతి, శ్రావణి, లాభాన పావని, పైల సత్యవతి, చందక విమల, అప్పలరాజుల, భాగ్యలక్ష్మితోపాటు మరో 42 మంది డయేరియా బారిన పడ్డారు. వీరికి స్థానిక వైద్యాధికారి పొన్నాడ హరితశ్రీ వైద్యం అందించారు. భాగ్యలక్ష్మి అనే మహిళ పరిస్థితి విషమించడంతో రాజాం ఆస్పత్రికి తరలించారు.
అధికారుల సందర్శన
గ్రామంలో డయేరియా ప్రబలిందని తెలుసుకున్న జిల్లా అదనపు వైద్యాధికారి బగాది జగన్నాథరావు, డీపీఓ బి.రవికుమార్‌తో పాటు తహసీల్దార్ మందుల లావణ్య, ఎంపీడీఓ కె.శ్రీనివాసరావు గ్రామాన్ని సందర్శించారు. తాగునీరు కలుషితం కావడం వల్ల వ్యాధి ప్రబలి ఉండవచ్చని తెలిపారు. గ్రామంలో 52 మందికి డయేరియా వచ్చినా అధికారులు ఎందుకు గోప్యత పాటించారో తెలీడం లేదు. రెండురోజులుగా గ్రామంలో బాధితుల సంఖ్య పెరుగుతున్నా బయటకు సమాచారం తెలియనీయలేదు.