ఎన్‌ఎంయూలో ముదిరిన విభేదాలు | Differences on the onset of nmu | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంయూలో ముదిరిన విభేదాలు

Published Tue, Apr 22 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

ఎన్‌ఎంయూలో ముదిరిన విభేదాలు

ఎన్‌ఎంయూలో ముదిరిన విభేదాలు

అధ్యక్ష స్థానం నుంచి నాగేశ్వరరావు తొలగింపు
సీమాంధ్ర కమిటీ అధ్యక్షుడిగా ధనుంజయరెడ్డి
తెలంగాణకు ఎన్నికల తర్వాతే అధ్యక్షుడు

 
హైదరాబాద్: ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ)లో నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నాగేశ్వరరావును అధ్యక్ష స్థానం నుంచి తొలగించడంతో పాటు యూనియన్ నుంచి సస్పెండ్ చేయగా.. యూనియన్ సొమ్మును దుర్వినియోగం చేశారంటూ ప్రధాన కార్యదర్శి మహమూద్‌పై నాగేశ్వరరావు ఆరోపణలు చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

అధ్యక్షుణ్ణి తొలగిస్తూ తీర్మానాలు

 ఎన్‌ఎంయూ అధ్యక్షుడిగా నాగేశ్వరరావును తొలగిస్తూ సీమాంధ్ర, తెలంగాణ కమిటీలు వేర్వేరుగా తీర్మానాలు చేశాయి. అనంతరం ఆయన్ను యూనియన్ నుంచి సస్పెండ్ చేశామంటూ ప్రధాన కార్యదర్శి మహమూద్ సోమవారం ఆర్టీసీ యాజమాన్యానికి లేఖ రాశారు. యూనియన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షుడిని తొలగించారంటూ నాగేశ్వరరావు వర్గం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నాగేశ్వరరావును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆదివారం తీర్మానం చేసింది. కమిటీ చైర్మన్ ఆర్వీవీఎస్వీ ప్రసాదరావు, అదనపు ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కమిటీ సమావేశం జరిగిందని. యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నాగేశ్వరరావును అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తూ కమిటీ కార్యవర్గం తీర్మానం చేసిందని ఎన్‌ఎంయూ సీమాంధ్ర నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కమిటీకి నెల్లూరుకు చెందిన వ్యాపారవేత్త ధనుంజయరెడ్డిని అధ్యక్షుడిగా నియమిస్తూ కార్యవర్గం తీర్మానించిందని వారు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎన్‌ఎంయూకు చీఫ్ వైఎస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
 
అదే బాటలో తెలంగాణ కమిటీ

 యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శులు చెన్నారెడ్డి, కమాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన తెలంగాణ కమిటీ కార్యవర్గ సమావేశంలో కూడా నాగేశ్వరరావును అధ్యక్షస్థానం నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ కమిటీ యథావిధిగా కొనసాగించాలని, ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల కమిటీల తీర్మానాలను గౌరవిస్తున్నామని యాజమాన్యానికి రాసిన లేఖలో మహమూద్ పేర్కొన్నారు.

 మహమూద్ వైఎస్సార్‌సీపీలో చేరిన తర్వాత..

 యూనియన్ నేతలు రాజకీయ పార్టీల్లో చేరకూడదనే నిబంధనేదీ లేదు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి మహమూద్ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత యూనియన్‌లో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం.

 విభజన తర్వాత సీమాంధ్రలో గుర్తింపు..

 సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 12 రీజియన్లు ఉన్నాయి. కార్మిక సంఘం ఎన్నికల్లో.. ఆరు చోట్ల ఎన్‌ఎంయూకు స్థానిక గుర్తింపు లభించింది. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)కు ఒక రీజియన్‌లో దక్కింది. తెలంగాణలో టీఎంయూతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన ఈయూకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర జిల్లాల్లో ఇరు సంఘాలకు వచ్చిన రాష్ట్రస్థాయి ఓట్లు, స్థానిక ఓట్ల ప్రకారం చూస్తే ఎన్‌ఎంయూకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. 2013 జనవరి 5న ఎన్నికల ఫలితాలు వెల్లడించి గుర్తింపు సంఘాలకు లేఖలు ఇచ్చారు. అప్పటి నుంచి రెండేళ్లపాటు గుర్తింపు కొనసాగుతుంది. అంటే 2015లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అప్పటి వరకు సీమాంధ్రలో ఎన్‌ఎంయూకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించే అవకాశం ఉందని కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement