కార్యక్రమంలో మాట్లాడుతున్న కోమటి జయరాం
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలన్నింటిలో డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేసేందుకు ప్రవాసాంధ్రులను సమన్వయపరచుకుని ముందుకు వెళుతున్నామని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. మార్కెట్ సెంటర్‌లోని హిందూ కాలేజీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్‌రూంను ఆల్బనీ ఆంధ్రా సంఘం (న్యూయార్క్) అధ్యక్షుడు, పాఠశాల పూర్వ విద్యార్థి నిడమానూరి వెంకట శ్రీనివాస్, శైలజ దంపతులు శుక్రవారం ప్రారంభించారు. ముఖ్య అతిధి కోమటి జయరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి, ఆధునిక విద్యాబోధన అందించేందుకు ఎన్నారైలు చిత్తశుద్ధితో ముందుకు వస్తున్నారన్నారు. 160 ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ హైస్కూల్లో చదివిన ఎన్‌వీ శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడినప్పటికీ తన మూలాలను మరచిపోకుండా పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూం ఏర్పాటు చేయించడం అభినందనీయమన్నారు.
ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల్లోడిజిటల్ క్లాస్‌రూములు
అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులను సమన్వయపరచుకుని రాష్ట్రంలోని ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఇ ప్పటివరకు మూడు వేల పాఠశాలల్లో పూర్తయిదని, మిగిలిన లక్ష్యాన్ని వచ్చే విద్యా సంవత్స రం ముగింపు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
భావి జీవితానికి బాటలు వేసిన పాఠశాల
డిజిటల్ క్లాస్‌రూం దాత ఎన్‌వీ శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ కాలేజీ హైస్కూల్లో విద్యార్థి దశలో వేసిన పునాది తన భావి జీవితానికి బాటలు వేసిందని చెప్పారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ తాను చదివిన పాఠశాల అభివృద్ధిలో భాగస్వామిని కావాలనే ఆశయంతో ఈ కార్యక్రమం కోసమే న్యూయార్క్ నుంచి వచ్చానన్నారు. పాఠశాల విద్య ఆర్జేడీ కేవీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన హిందూ కాలేజీ హైస్కూల్లో డిజిటల్ క్లాస్‌రూం ఏర్పాటుకు యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబరిచిందని చెప్పారు. విలువలతో కూడిన విద్యాబోధనతో విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతోందని అన్నారు.
హిందూ కాలేజీ హైస్కూల్ కార్యదర్శి మాజేటి వీఆర్‌కే ముత్యాలు, పాఠశాల పాలక మండలి అధ్యక్షుడు జి. శివరామకృష్ణ ప్రసాద్, కార్యదర్శి జీవైఎన్ బాబు, ప్రధానోపాధ్యాయుడు ఎస్. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment