
బల్లికురవ మండల వి.కొప్పరపాడు గ్రామ సచివాలయం
సాక్షి, అద్దంకి: గత ప్రభుత్వాలు కాగిత రహిత పాలన ఈ–పంచాయతీ అంటూ ప్రచారం చేసుకున్నా అమలుకు నోచుకోలేదు. ప్రచార ఆర్భాటం కోసం వ్యయం చేసిన కోట్లు వృథా చేయడం మినహా ఏ పథకం పంచాయతీ స్థాయిలు అమలుకు నోచుకున్న పాపాన పోలేదు. రెండు, మూడు పంచాయతీలకు ఒక కంప్యూటరు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ–పంచాయతీ ఆశించిన మేర ఫలితాలు రాక కాగిత రహిత పాలన అటకెక్కింది. అయితే నూతన ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్‌మోహనరెడ్డి గ్రామ సుపరిపాలన కోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. అందులో ఒక డిజిటల్ అసిస్టెంట్‌ను నియమించడంతోపాటు, నెట్ సౌకర్యం, ఆధునాత కంప్యూటరు, ఇతర పరికరాలను ఇచ్చారు. దీంతో ఈ–పంచాయతీ పటిష్టంగా అమలై తమ సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కారం అవుతాయనే నమ్మకం ప్రజల్లో కలుగుతోంది.
పారదర్శక సేవల కోసమే డిజిటల్ అసిస్టెంట్..
ప్రతి 50 గృహాలకు ఒక వలంటీరును నియమించిన ప్రభుత్వం, వారి ద్వారా సేకరించిన సమాచారిన్ని డిజిటలైజేషన్ చేయడానికి, ఇతర రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరు, ఆధార్ కార్డు, తదితర సేవను పారదర్శకంగా గ్రామ స్థాయిలోనే అందించడం కోసం, ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. అందులో డిజిటల్ సేవలను పారదర్శకంగా చేయడం కోసం ఒక డిజిటల్ అసిస్టెంట్‌ను నియమించింది.
డిజిటల్ అసిస్టెంట్ విధులివే..
1. గ్రామ సచివాలయంలో నియమించిన డిజిటల్ అసిస్టెంట్ గ్రామ వలంటీర్లు సేకరించిన గృహాల డేటాను కంప్యూటరీకరించాలి.
2. దరఖాస్తు రూపంలో అందిన సమస్యలను ఆయా శాఖల వారీగా విభజించి గ్రామ కార్యదర్శికి పంపాలి.
3. కార్యాలయానికి వచ్చే ప్రజలకు అడిగిన సమాచారాన్ని స్నేహపూర్వకంగా అందించాలి.
4. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను జవాబుదారీ తనం కోసం రసీదులు ఇవ్వడం, ఉత్తర ప్రత్యుత్తరాలు, రికార్డు చేయడం, రికార్డుల్లో రాయడం చేయాలి.
5. అందిన దరఖాస్తును చెక్ లిస్ట్ సహాయంతో ప్రాధమిక పరిశీలన చేసి స్వీకరించాలి.
6. కార్యాలయానికి వచ్చే ప్రజలకు అవసరమైన దరఖాస్తు ఏ విధంగా నింపాలో వివరించి చెప్పాలి.
7. గ్రామ సచివాలయంలో ఉండే మొబైల్ అప్లికేషన్స్, ట్యాబ్‌లు, కంప్యూటరు సిస్టమ్స్, వంటి వాటికి సాంకేతిక మేనేజరుగా వ్యవహరించాలి.
8. జనన, మరణాలు ఆన్‌లైన్ చేయడం, ఆస్తి మదింపు పన్ను, డిమాండ్ మొదలైన స్థానిక ప్రభుత్వ డేటాను యాప్స్‌లో నమోదు చేసి ఆన్‌లైన్ చేయాలి.
ఇలాంటి సేవలు అందించే డిజిటల్ అసిస్టెంట్ గ్రామ సచివాలయంలో అందుబాటులోకి రావడంతో గ్రామాల్లో ప్రజలు తమ సమస్యలను పరిష్కారం కోసమో, దరఖాస్తులు నింపడం కోసమో ఎవరి దగ్గరకు వెళ్లనవసరం లేదు. మండల కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి సబందించిన అన్ని పనులు గ్రామ సచివాలయంలోనే అవుతాయని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment