
'రాజీనామాలపై ఎంపీలు పునరాలోచన చేయాలి'
న్యూఢిల్లీ : సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ రాజీనామాల విషయాన్ని పునరాలోచించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గటం మంచిది కాదని దిగ్విజయ్ సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తుపానును అడ్డుకుంటామన్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన పట్టించుకోలేదు.
సీమాంధ్ర ప్రాంత నేతలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి తమకు తెలిసిందేనని అన్నారు. ఆ సమస్య నుంచి బయటపడేందుకు పరిష్కారం కనుక్కుందామన్నారు. సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరిచేలా జీవోఎంకు ప్రతిపాదనలు పంపుదామని దిగ్విజయ్ అన్నారు. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తీర్మానం పంపుతామని ఆయన తెలిపారు. షెడ్యూల్లో ఏమైనా మార్పులు ఉంటే మరోకటి ఇవ్వాలని కోరతామన్నారు.