
నిన్న కేరాఫ్ కంచరపాలెం..నేడు మధురవాడ... వెండితెరపై విశాఖ ఖ్యాతి పెంచేవిధంగా యువ దర్శకులు తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. క్రియేటివ్‌గా ఆలోచిస్తూ..కొత్తకొత్త కథలు రాసుకుంటున్నారు. మన మధ్య జరిగే సంఘటనలు..మనతో ఉండే వారినే నటులుగా తీర్చిదిద్దుతున్నారు. చిన్న సినిమాలుగా రూపుదిద్దుకుని బడా నిర్మాతలను ఆకర్షించి సూపర్ హిట్‌లు కొడుతున్నారు. ఈ కోవకు చెందిన దర్శకుడే మన మధురవాడకు శ్రీనివాసరావు..ఉరఫ్ అజిత్ వాసన్. తనకు బతుకునిచ్చిన మధురవాడే తన సినిమాకు టైటిల్‌గా పెట్టి మూడు భాషల్లో తీసేందుకు సిద్ధమవుతున్నాడు. లొకేషన్లు చూసేందుకు వచ్చిన అజిత్ ‘సాక్షి’ తన భావాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే...
పుట్టింది సబ్బవరం మండలం ఎల్లుప్పి. చదువుకున్నది మల్లునాయుడు పాలెం. బతుకుదారి చూపింది మాత్రం మధురవాడ. అందుకే మధురవాడ అంటే ఎనలేని అభిమానం. మధురవాడ పేరుతో సినిమా తీయాలని..అది కూడా మంచి సబ్జెక్ట్ అయి ఉండాలని కలలు కన్నా. అనుకున్నట్టు అద్భుతమైన కథ సిద్ధమైంది. డిసెంబర్‌లో షూటింగ్‌కు వెళుతున్నాం. ‘వాసు నాన్ పక్కా కమర్షియల్’ అనే కన్నడ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించా. అక్కడ సూపర్‌హిట్ కొట్టా. రెండో చిత్రంగా తెలుగులో ‘మధురవాడ’కు శ్రీకారం చుట్టా.
మధురమైనది మధురవాడ
మధురవాడపై నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి. క్రైం, భూ కబ్జాలు వంటి నేరపూరిత ప్రాంతమని చాలా మంది భావన. అసలు మధురవాడ అంటే మధురమైనది. ఇక్కడ యువత చాలా రంగాల్లో తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. మధురవాడ యూత్ మంచితనమే నా చిత్రానికి మూల కథ. బతుకుదారిని చూపిన వ్యక్తులను, ప్రాంతాన్ని మర్చిపోకూడదనే కథకు యాప్ట్ అయ్యే టైటిల్ పెట్టా.
పాటలు, మ్యూజిక్ లేని సినిమా ఇది..
ఇక్క పాట ఉండదు. మ్యూజిక్‌తో పనేలేదు. ప్రేమ ఉండదు. లిప్‌కిస్‌లు అసలే ఉండవు. ఇది ఏడుగురి యువకుల కథ. అనుకోకుండా జైలుకు వెళతారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన సంఘటనలే ‘మధురవాడ’. చాలా అద్భుతంగా..అత్యంత పకడ్బందీగా స్క్రిప్ట్ తీర్చిదిద్దా. రెండు గంటల సినిమాల్లో ఎంతో ఉత్కంఠ క్రియేట్ చేశా..రేపు సినిమా చూసివాళ్లంతా కచ్చితంగా మెచ్చుకుంటారు. మధురవాడ యువకులు కాలర్ ఎగరేసి తిరిగే సినిమా ఇది.
ఆయనే ప్రేరణ
నేను కష్టాల్లో ఉన్నప్పుడు ‘వాసు నాన్ పక్కా కమర్షియల్’ హీరో, నిర్మాత అనిష్ తేజేశ్వర్ ఆదుకున్నారు. నన్ను పిలిచి ‘వాసు నాన్ పక్కా కమర్షియల్’ సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. హీరో అనీష్, సినీ నటి, ఎమ్మెల్యే రోజా నన్ను ఎంతో ప్రోత్సహించారు.
మూడు ప్రాంతాల్లో షూటింగ్
సినిమా షూటింగ్ అంతా వైజాగ్, బెంగళూరు, చైన్నైలలో సాగుతోంది. తెలుగు సినిమా షూటింగ్ మొతకతం ఇక్కడే. మధురవాడలోనే డిసెంబర్ నెలాఖరుకు ప్రారంభించి ఏప్రిల్‌లో విడుదల చేస్తా.
అంతా కొత్తవాళ్లే...
మధురవాడ సినిమాలో అంతా కొత్తవాళ్లే ఉంటారు. అది కూడా స్థానికులే. వారిని ప్రోత్సహించడం ఒక కారణమైతే..నా బడ్జెట్‌లో సినిమా పూర్తవుతుంది. కొత్తవాళ్లతో అయితే నేననుకున్నట్టు తీయగలను. ఏడుగురు యువకులు ఇందులో హీరోలు. టెక్నీషియన్స్, కెమేరామన్‌లు మాత్రం సీనియర్స్‌నే తీసుకుంటున్నా. ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందిస్తున్నా...తెలుగులో బీవీ కృష్ణారెడ్డి, ఎం. వెంకటేష్ నిర్మాతలు. తమిళంలో ‘కన్ ఇమ్యుకాం నేరతిల్ అనే టైటిల్‌తో తెరకెక్కనుంది. దీనికి నా పేరు శివ ఫేం డైరెక్టర్ సుశీంద్రన్ ఈ కథ విని తాను రిజర్వ్ చేసుకున్న టైటిల్ గిఫ్ట్‌గా ఇచ్చారు. తమిళ, కన్నడ రెండు సినిమాలకూ నరేన్ నిర్మాత.
ఆగస్టులో బాలీవుడ్ మూవీ
వచ్చే ఏడాది ఆగష్టు, సెప్టెంబర్‌లో హిందీ సినిమా చేయబోతున్నా. సోలో సినిమా. భారీ బడ్డెట్‌తో రాబోతోంది. త్వరలో మధురవాడ టీజర్, ట్రైలర్ విడుదల చేస్తా.
Comments
Please login to add a commentAdd a comment