ఉత్త మాటలే.. | Disappointing budget | Sakshi
Sakshi News home page

ఉత్త మాటలే..

Published Thu, Aug 21 2014 12:20 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ఉత్త మాటలే.. - Sakshi

ఉత్త మాటలే..

  • విమ్స్, ఏయూకు మినహా అన్నింటా రిక్తహస్తమే
  •  బడ్జెట్లో రుణమాఫీ కేటాయింపుల్లో జిల్లాకు దక్కేది స్వల్పమే
  •  విశాఖ అభివృద్ధిపై సీఎం చిన్నచూపు
  •  ఐటీ, పర్యాటకం, పారిశ్రామిక రంగాల ప్రస్తావనే లేదు
  •  ఎయిర్‌పోర్టు, కేజీహెచ్, సుజల స్రవంతికి కేటాయింపులు నిల్
  • అంతన్నారు ఇంతన్నారు. తీరా చూస్తే బడ్జెట్ కేటాయింపుల దగ్గరకు వచ్చేసరికి విశాఖకు రిక్తహస్తం మిగిల్చారు. రాష్ట్రంలో విశాఖపట్నాన్ని ముంబైగా మార్చుతానని, ప్రపంచాన్ని నగరం ముంగిటకు తీసుకువస్తానని సీఎంగా అనేకసార్లు ప్రకటించిన చంద్రబాబు ఆచరణలో  మొండిచేయే చూపించారు. బుధవారం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఊసే లేదు.
     
    సాక్షి,విశాఖపట్నం :  విభజన తర్వాత ఏపీలో ఐటీ,పారిశ్రామిక,పర్యాటక రంగాలకు విశాఖ కేంద్రంగా అవతరించడంతో బడ్జెట్లో ఈప్రాంతానికి అత్యదిక ప్రాధాన్యత కలుగుతుందని అంతా ఆశించారు. తీరాచూస్తే మాటలు బారెడు, కేటాయింపులు మూరెడు అన్న చందంగా మా రింది. ఒక్క విమ్స్,ఆంధ్రాయూనివర్సిటీలకు మాత్రమే కొంత ఊరట కలిగించారు. విమ్స్‌కు రూ.12కోట్లు, ఆంద్రాయూనివర్సిటీకి రూ.292 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. గంగవరం పోర్టులో రూ.4,500కోట్లతో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన కంపెనీకి అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ ఈఎన్‌టీ ఆస్పత్రికి రూ.50లక్షలు కేటాయించారు. ఇవిమినహా విశాఖకు బడ్జెట్లో ప్రత్యేకంగా ఒరిగింది శూన్యమనే చెప్పాలి.
     
    వాస్తవానికి విభజన తర్వాత ఏపీలో పారిశ్రామిక,ఐటీ,పర్యాటక రంగాలకు విశాఖ రాజధానిగా అవతరించింది. దీంతో ఈప్రాంతం అభివృద్ధిపై ప్రభుత్వం భారీగా దృష్టిపెడుతుందని భావించినా బడ్జెట్లో ఈప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించలేదు. ఐటీ రంగంలో ఏపీ వాటా భవిష్యత్తులో రూ.43,600కోట్లకు చేరుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం ఇక్కడ ఐటీఐఆర్ ఏర్పాటు,కొత్త కంపెనీలకు అనుమతులు గురించి నామమాత్రం ప్రస్తావన లేదు.  పారిశ్రామికరంగం బడ్జెట్ నుంచి ఎంతో ఆశించింది.  కేవలం విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మిస్తామని ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. పర్యాటక రంగంపైనా ఆశ్రద్ధే కనబర్చారు.

    తిరుపతిలో రూ.117కోట్లతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం విశాఖలో ఆగిపోయిన కన్వెన్షన్ సెంటర్‌కు కనీసం నిధులు కేటాయింపులు చేయలేదు. కాకినాడ,విజయవాడ,తిరుపతి ఎయిర్‌పోర్టుల విస్తరణ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అభివృద్ధికి నోచుకోని విశాఖ ఎయిర్‌పోర్టుపై కనీస హామీ కూడా ఇవ్వలేకపోయింది. కేజీహెచ్ అభివృద్ధికి గతంలో ప్రభుత్వం రూ.5కోట్ల వరకు కేటాయించింది.

    ప్రస్తుత ప్రభుత్వం కేజీహెచ్‌పై కన్నెత్తికూడా చూడలేదు.  కీలకమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంపైనా శీతకన్నేసింది. గత ప్రభుత్వం ఈప్రాజెక్టుకు రూ.3కోట్లు కేటాయించగా, ఇప్పుడు రిక్తహస్తం మిగిల్చింది. రుణమాఫీ పథకానికి రాష్ట్రబడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించగా, ఒక్క విశాఖజిల్లాలోనే రూ.1,040 కోట్ల వరకు మాఫీ చేయాల్సి ఉంది. అలాంటప్పుడు కేటాయించిన తక్కువ బడ్జెట్ జిల్లాలో సగానికికూడా లబ్దిదారులకు అందేలా లేదు. అంటే అసలు రుణమాఫీ ఎంతమందికి అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
     
     నిరాశ బడ్జెట్
     రుణ మాఫీ అజెండాతో అధికారం చేజిక్కుంచుకున్న టీడీపీ రాష్ట్ర బడ్జెట్‌లో రుణమాఫీ చేస్తుందని ప్రజలంతా ఎదురు చూశారు. ప్రజలను నిరాశ పరిచేలా బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. యువతకు ప్రాధాన్యత కల్పించలేదు. రాష్ట్ర విభజన అనంతరం కీలకంగా మారిన విశాఖ అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటయించకపోవడం దురదృష్టకరం.
     - వంశీకృష్ణశ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ నాయకుడు.
     
     సాహసోపేత బడ్జెట్
     మౌలిక వసతులకు ప్రాధాన్యం కల్పిస్తూ లక్షకోట్లతో బడ్జెట్ ఏర్పాటు చేయడం సాహసోపేత నిర్ణయం. పెట్టుబడులను పెంచడానికి ఇది ఆరంభంగా నిలుస్తుంది. ప్రభుత్వం సంక్షేమ బాధ్యతను విస్మరించలేదు. విద్యకు సమపాళ్లలో నిధులను కేటాయించారు. అన్ని రంగాలను పునరుజ్జీవింపచేసే బడ్జెట్ ఇది. పరిమిత వనరులతో అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రణాళికేతర వ్యయం ప్రభుత్వ భారాన్ని స్పష్టం చేస్తుంది.  నిర్దిష్ట లక్ష్యాలు, అత్యంత ఆవశ్యకాలను గుర్తించి ప్రాథమిక నిధులు ఏర్పాటు చేస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది సాధ్యమవుతుంది.
     -ఆచార్య కె.రామ్మోహనరావు, రిజిస్ట్రార్
     
     ఇది మాయ బడ్జెట్
     రాష్ట్ర ప్రభుత్వం మాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపులో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం రూ.2100 కోట్లు బడ్జెట్‌లో కూటేయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ. 1150 కోట్లు మాత్రమే కేటాయించి అన్యాయం చేసింది.                           - కిల్లో సురేంద్ర, ఏపీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు, అరకులోయ

     గిరిజనులకు ప్రాధాన్యత లేదు
     ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్‌లో జనాభా ప్రాతిపదికన కేటాయించకుండా ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసింది. జాబు కావాలంటే బాబురావాలని నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపింది. ఇంధిరమ్మ ఇళ్లకు బడ్జెట్‌లో నామామాత్రంగా ప్రాధాన్యత  ఇచ్చారు. ఇళ్లన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయే ప్రమాదం వుంది.                  
    - కె.అరుణకుమారి, ఎంపీపీ, అరకులోయ
     
     బాగానే సర్దుబాటు చేశారు..!
     కొత్త రాష్ట్రంలో బడ్జెట్ రూపకల్పన బాగానే చేశారు. బడ్జెట్ లోటు వున్నప్పటికీ ఆ ఇబ్బంది లేకుండా అన్నింటికీ సమన్యాయం చేశారు. రాజధాని లేని ఈ రాష్ట్రానికి ఉన్నంతలో ఇబ్బందులు లేకుండా బాగానే సర్దుబాటు చేశారు. 10 ఏళ్లుగా అభివృద్దికి నోచుకోని ప్రజలకు బడ్జెట్ ఆశలు కల్పించింది.
     - బండారు రంగమోహన్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీజేపీ
     
     విజన్ లేదు..!
     బడ్జెట్‌లో విజన్ కనిపించడం లేదు. విశాఖ అభివృద్దికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. యువత ఓట్లు చేజిక్కించుకున్న తర్వాత వారి అవసరం లేదనుకున్నారో ఏమో గానీ వారికి ఉపయోగపడే పధకాలు లేవు. సాంకేతిక విద్యను యువతకు చేరువ చేసేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు లేవు.
     -బాణాల శ్రీనివాసరావు, పీసీసీ కార్యదర్శి

     రుణమాఫీకీ బడ్జెట్ ఏదీ..!
     రుణమాఫీకి బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. రుణమాఫీ చేస్తానంటూ ఓట్లడిగిన చంద్రబాబు ఆ వర్గాన్ని బడ్జెట్‌లో వదిలేశారు. రైతుల కోసం రూపాయి కూడా కేటాయింపులు చేయలేదు.
     - బెహరా భాస్కరరావు , కాంగ్రెస్ నగర అధ్యక్షుడు
     
     నిరాశ నింపింది..
     బడ్జెట్ నిరాశ నింపింది. చంద్రబాబు బూటకపు హామీలు తమ వర్గానికే మేలు చేసేలా వుంది. ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల అనుభవం వుందని చెప్పుకుంటున్న చంద్రబాబు మొదటి బడ్జెట్ అంకెల గారడీలా వుంది. ఏపీ చరిత్రలో ఇలాంటి బడ్జెట్‌ను ఎప్పుడూ చూడలేదు.
     - కొయ్యా ప్రసాదరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ శ్రీకాకుళం ఇన్‌చార్జి
     
     ప్రజల్ని మభ్యపెట్టారు
     రాష్ట్ర బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేదిగా ఉంది. బడ్జెట్‌లో కేటాయించిన అంకెలకు పెద్ద విలువ లేకుండా పోయింది. రైతుల రుణమాఫీకి ఆర్‌బీఐతో చర్చలు జరుపుతున్నట్టు, వనరుల సమీకరణకై ప్రభుత్వం నిమగ్నమైనట్టు చెప్పి బాధ్యతను దాట వేసింది.  రైతులను అయోమయంలోనికి నెట్టింది.   బడ్జెట్‌లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పి కేవలం రూ.400కోట్లు మాత్రమే కేటాయించి ఎక్కువ భాగం ప్రైవేటు రంగానికి అప్పజెప్పుతున్నట్టు స్పష్టం అవుతోంది.
     - కె. లోకనాథం.  సీపీఎం జిల్లా కార్యదర్శి

     ఉత్తరాంధ్రకు ప్రయోజనమేది?
     రాష్ట్ర బడ్జెట్‌లో ఉత్తరాంధ్రకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఐటీ రంగం అభివృద్ధి గురించి పెద్ద లక్ష్యాలు ప్రకటించినా, కేటాయింపులు కేవలం రూ.111 కోట్లు మాత్రమే ఉండటం విచారకం. స్టీల్‌ప్లాంట్ గనులు కేటాయింపు గాని, దీనికి అనుబంధ పరిశ్రమలు ఈ ప్రాంతంలో నెలకొల్పే ప్రతిపాదన గాని బడ్జెట్‌లో ప్రస్తావనకు నోచుకోలేదు.  బడ్జెట్‌లో విశాఖకు కూడా న్యాయం జరగలేదు. జిల్లా ఎమ్మెల్యేలంతా బడ్జెట్ కేటాయింపుల జరిగేలా పట్టుబట్టాలి.
     - ఎమ్.వి.ఎస్.శర్మ, ఎమ్మెల్సీ

     కేంద్ర నిధులపై ఆధారపడ్డ బడ్జెట్..
     రాష్ట్ర సొంత నిధులు కేవలం 34 శాతం మాత్రమే ఉండటంతో కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడిన బడ్జెట్ ఇది. పటిష్ట వ్యూహం దర్శించడం లేదు. వృద్ధి కన్నా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విజన్ 2029కి మార్గ దర్శక సూత్రాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రణాళికేతర వ్యయం 80 శాతం ఉంటడం కొంత ఇబ్బందికరం. మొత్తం మీద కేంద్రం, ఇతర వనరులపై ఆధారపడి రూపొం దించిన బడ్జెట్ అన్నది సుస్పష్టం.
      - ఎం.సుందరరావు, అర్థశాస్త్ర విభాగం, ఏయూ

     ఉత్తరాంధ్రకు నిధులివ్వాల్సింది..
     వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్దికి మరింత నిధులు కేటాయిస్తే బాగుండేది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం అభినందనీయం. ఎఫ్‌డీఐలలో మన రాష్ట్ర శాతం పెంచుకోవడం ద్వారా మౌలిక వసతుల అభివృద్ది సాధ్యపడుతుంది. ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమే. అదే స్థాయిలో ఉన్నత విద్యకు మరింత నిధుల కేటాయింపులు జరపాల్సి ఉంది.  గ్రామీణాభివృద్ది, ఆరోగ్య రంగాలకు కేటాయింపులు బాగున్నాయి.      
      - ఆచార్య టి.కోటేశ్వరరావు, అర్థశాస్త్ర విభాగాధిపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement