
విభజనపై చర్చే లక్ష్యం.. సీఎం కిరణ్
విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరపడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని, భవిష్యత్ గురించి ఏమీ ఆలోచించడంలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు.
కొత్త పార్టీ పెట్టమని కొంతమంది కోరుతున్న మాట వాస్తవమే
సాక్షి, హైదరాబాద్: విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరపడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని, భవిష్యత్ గురించి ఏమీ ఆలోచించడంలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. వ్యాట్ ఆదాయం పెంచడంలో భాగంగానే మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్చానని, అది పూర్తిగా తన పరిధిలో అధికారమని, దీనిపై ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. శాసనసభ వ్యవహారాల బాధ్యతలను రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న శైలజానాథ్‌కు ఇవ్వడంతో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్న విమర్శలపై స్పందించడానికి నిరాకరించారు. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం కిరణ్ బుధవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో వూట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీలోనే తెలంగాణ నాయకులు, సీమాంధ్ర నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయన్నారు.
అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎవరి అభిప్రాయాలు వారు చెబుతారన్నారు. ఇప్పటి వరకు విభజనపై సభలో చర్చ జరగలేదని, దానిపై చర్చ జరిగితే ఎవరి అభిప్రాయం, ఎవరి వాదం ఏమిటనేది బయటపడుతుందని చెప్పారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు ఖండించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు సభ బయట మీడియా ముందు మాట్లాడటం వల్ల లాభం ఉండదని స్పష్టంచేశారు. ‘‘మీడియా ముందు ఎన్ని మాట్లాడినా అవి రికార్డు కావు. వాటిని పార్లమెంట్ గానీ, రాష్ట్రపతి గానీ పరిగణనలోకి తీసుకోరు. అసెంబ్లీలో మాట్లాడితేనే రికార్డు అవుతుంది. ఆ రికార్డులను పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుంటుంది. సభలో చర్చించడం అంటే అభిప్రాయం చెప్పడమే అవుతుంది’’ అని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని, కేవలం పార్టీ తీసుకున్న నిర్ణయంపైనే మాట్లాడానని సీఎం వివరణ ఇచ్చారు. సమైక్య తీర్మానం చేస్తారా అని అడగ్గా.. అసెంబ్లీలో ఏ అంశంపైన చర్చ జరగాలన్నా కొన్ని సంప్రదాయాలు, నిబంధనలు ఉంటాయని, వాటి ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందని బదులిచ్చారు. కొత్త పార్టీపై ఇప్పుడే ఆలోచించడంలేదని, అయితే పార్టీ పెట్టమని కొంతమంది కోరుతున్న మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి వెల్లడించారు. బంతి దగ్గరకు రాకుండానే దాన్ని ఫోర్, సిక్స్ కొట్టాలని ప్రయత్నిస్తే ఔట్ అవుతానన్నారు. సమయానుగుణంగా బంతి దగ్గరకు వచ్చాక డిఫెన్స్ ఆడాలా, ఫోర్ లేదా సిక్స్ కొట్టాలా అన్నదానిపై ఆలోచించాలని ఆయన వ్యాఖ్యానించారు.