మహిళల్ని మోసం చేస్తారా?
- అప్పు చెల్లించొద్దని ఒట్టేయించుకున్న బాబు
- నేడు చేతులెత్తేస్తే ఎలా...
- వడ్డీ, అప్పు ఎవరు చెల్లిస్తారు...
- రుణమాఫీ తీరిదేనా?
- వైఎస్సార్‌సీపీ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన
గుడివాడ : రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళల్ని చంద్రబాబు నిలువునా ముంచేశారని శాసనసభలో వైఎస్సార్‌సీపీ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో అప్పులు చెల్లించొద్దని చెప్పి ఒట్టేయించుకున్న చంద్రబాబు నేడు రుణమాఫీ భారం నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు.
సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అలాగే రైతుల రుణమాఫీకి రూ.లక్షకోట్ల పైచిలుకు కావాల్సి ఉండగా బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.5వేలు కోట్లు విదిలించారని చెప్పారు. ఇది ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. రుణమాఫీపై మాట మార్చిన చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎన్నికల ముందు ఆయన మాటలు నమ్మి ఇప్పటి వరకు డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించలేదని, ఫలితంగా బ్యాంకుల్లో వేలాది రూపాయలు వడ్డీలు బకాయి పడ్డాయని వీటిని ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇచ్చింది వారికి మేలు చేయడానికే తప్ప... ప్రజలపై భారం మోపడానికి కాదన్నారు.
ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా...
ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అధికార టీడీపీ ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే వారి బండారం బయట పడుతుందని చెప్పి ఎవరినీ మాట్లాడనివ్వకుండా స్పీకర్ మైక్ కట్ చేయడం దారుణమన్నారు. కేటాయింపులకు బడ్జెట్ అంచనాలకు పొంతన లేదని ఎలా నిధులు తెస్తారని ప్రశ్నించినా సమాధానం దాట వేశారని చెప్పారు.
అంటే రానున్న కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై పన్నులు భారం మోపటానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టమైందని తెలిపారు. పదేళ్లపాటు పాలించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రజలపై పైసా పన్ను వేయకుండా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ప్రజలపై భారాలు మోపితే తాము సహించేది లేదని హెచ్చరించారు. పెదపారుపూడి జెడ్పీటీసీ మూల్పూరి హరీష పాల్గొన్నారు.