
పనితీరు మారకపోతే చర్యలు
అధికారులకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి హెచ్చరిక
అనంతపురం మెడికల్:
‘జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్ధిష్టమైన ప్రణాళిక ప్రకారం చేపడుతున్నట్లుగా కనిపించడం లేదు.. మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నట్లున్నారు.. క్రమశిక్షణారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది.. మాతాశిశు మరణాలు, ఆస్పత్రిలో ప్రసవాలు నిర్వహించే అంశాల్లో ైవె ఫల్యాన్ని మీ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి’ అని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మారకపోతే చర్యలు తప్పవని అధికారులను ఆయన హెచ్చరించారు.
ఆదివారం జిల్లాకు విచ్చేసిన ఆయన వైద్య కళాశాలలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయనతోపాటు కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్, మెడికల్ ఎడ్యుకేషన్ అదనపు డెరైక్టర్ వెంకటేశ్, కళాశాల ప్రిన్సిపాల్ నీరజ, డీఎంహెచ్‌ఓ రామసుబ్బారావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బోధనాస్పత్రి సూపర్‌స్పెషాలిటీ స్థాయి తరహా సేవలు అందించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.
ఇందుకు సంబంధించిన నిధులు వినియోగించుకోలేక పోతే మురిగిపోతాయన్నారు. ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగా అమలు కావడం లేదనేది స్పష్టమవుతోందన్నారు. ప్రధానంగా మాతా శిశు మరణాలను అరికట్టడంలో వైఫల్యం కనిపిస్తోందన్నారు. ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా చూడడం లేదు. గర్భిణీలకు ఆరోగ్య సిబ్బంది అంగరక్షకులుగా పనిచేయాలని సూచించారు. గర్భిణులకు సంబంధించిన వివరాలు మీ వద్ద ఉన్నట్లులేదు.
రేపటి నుంచే డేటా సేకరణ సర్వే ప్రారంభించి, జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మనం ప్రజల కోసమే ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకుని పనిచేయాలని హితువు పలికారు. సమావేశంలో అదనపు వైద్యాధికారి వెంకటరమణ, అదనపు వైద్యాధికారి (ఎయిడ్స్ కంట్రోల్) సాయిప్రతాప్, ఆర్‌ఎంఓ కన్నెగంటి భాస్కర్, ఆస్పత్రుల సమన్వయ కర్త రామకృష్ణరావు, మలేరియా అధికారి ఆదినారాయణరెడ్డి, జబార్ కో-ఆర్డినేటర్ విజయమ్మ, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ ఉమాశంకర్, తదితరులు పాల్గొన్నారు.