శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం కొత్త తరహాలో నిర్వహించిన డీఎస్సీ-14 భర్తీ జరుగుతుందో లేదోనన్న సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. అనాలోచిత నిర్ణయాలతో డీఎస్సీని ప్రకటించడం వల్ల ఇప్పుడు భర్తీకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. టెట్ కమ్ టీఆర్‌టీ పేరిట డీఎస్సీ పరీక్షలు నిర్వహించడం సరైన విధానం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థులపై భారాన్ని మోపకూడదని యోచిస్తూ టెట్ కమ్ టీఆర్‌టీని నిర్వహిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం అభ్యర్థులపై మరింత భారాన్ని మోపేలా పరీక్షను నిర్వహించింది. గతంలో 100 మార్కులకు పరీక్ష నిర్వహించగా ఇప్పుడు 200 మార్కులకు పరీక్ష పెట్టారు. అయితే సమయాన్ని మాత్రం 3 గంటలు మాత్రమే పెట్టడాన్ని తప్పుబడుతున్నారు.
ప్రస్తుత విధానం వల్ల అభ్యర్థులు సోషల్, మ్యాథ్స్, సైన్స్‌తోపాటు మరిన్ని సబ్జెక్టులను చదవాల్సి వస్తోంది. ఉదాహరణకు తెలుగు పండిట్ అభ్యర్థి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 70 మార్కులకు, సోషల్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు 60 మార్కులకు, మిగిలిన అంశాలకు సంబంధించి 70 మార్కులకు చదవాల్సి వచ్చింది. ఇన్ని మార్కులకు తర్ఫీదు పొందాలంటే రోజుకు 18 గంటలకు పైగా శ్రమించాలి. గతంలో 100 ప్రశ్నలను 3 గంటల్లో రాస్తే ఇప్పుడు అదే సమయంలో 200 ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై కొందరు అభ్యర్థులు కోర్టులో కేసు వేశారు. అలాగే గతంలో టెట్ నిర్వహించినప్పుడు ప్రశ్నపత్రాల కాఠిన్యత స్థాయి నియమాలను అనుసరించి మార్కులను కలిపేవారు.
టెట్ కమ్ టీఆర్‌టీ గతంలో కంటే కఠినమైనప్పటికీ గత నియమాలను అనుసరించకపోవడంతో గతంలో టీఈటీ ఉత్తీర్ణులైనవారికి వెయిటేజ్ ఉండడంతో వారు లబ్ధిపొంది తాము నష్టపోతున్నామంటూ కొత్తగా పరీక్ష రాసిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అలాగే ఎన్‌సీటీఈ టెట్ నిర్వహించమని సూచించింది తప్ప టెట్ కమ్ టీఆర్‌టీ నిర్వహించమని చెప్పలేదని, టెట్‌కు వెయిటేజ్ ఇమ్మని చెప్పలేదని, ఓసారి టెట్‌లో అర్హత పొందితే ఏడేళ్ల వరకు టెట్ రాసే అవసరం లేదని ఎన్‌సీటీఈ చెప్పినప్పటికీ అందుకు విరుద్ధంగా డీఎస్సీ నిర్వహించడంపై కూడా అభ్యర్థులు కోర్టు దష్టికి తీసుకెళ్లారు. అలాగే కీ లోని పలు తప్పులు దొర్లాయంటూ ఆధారాలతో సహా పలువురు అభ్యర్థులు చెప్పినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఫలితాలను విడుదల చేసింది. తుది కీ లో 13 తప్పులు ఉన్నాయంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆధారాలతో సహా ఆశ్రయించారు.
ఇవన్నీ పరిష్కారమవ్వాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వం కూడా నియమ నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహించడంతో కోర్టు తీర్పు ప్రభుత్వానికి ప్రతికూలంగా వస్తే అసలు నియామకాలుంటాయా అనే సందేహం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే వీటికి జవాబు చెప్పేవారే లేకుండా పోయారు.
డీఎస్సీ భర్తీ అనుమానమే!
Published Thu, Jun 18 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement
Advertisement