విశాఖ రూరల్: డీఎస్సీ అభ్యర్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. టెట్, డీఎస్సీని కలిపి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్-కమ్-టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టెట్-కమ్-టీఆర్‌టీ)గా వ్యవహరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో కొంత అస్పష్టత అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది. పాత పద్ధతిలోనే ప్రకటన రావడంతో బీఈడీ అభ్యర్థులకు నిరాశే మిగలింది. సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు కానున్నారు.
మే 9 నుంచి 11 వరకు పరీక్షలు: నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 2వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏపీ ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల ద్వారా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మే 9న ఎస్జీటీలకు, 10న లాంగ్వేజ్ పండిట్‌లకు, 11న స్కూల్ అసిస్టెంట్లకు పరీక్ష జరగనుంది. మే 28న ఫలితాలు వెలువడనున్నాయి.
అభ్యర్థుల్లో గందరగోళం: టెట్-కమ్-టీఆర్‌టీ పేరుతో నూతన విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తుండడం వల్ల ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారు సైతం మరోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. టెట్ పరీక్షల్లో వెయిటేజీ ఆధారంగానే డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో టెట్ రాసిన వారు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన పోస్టులు
జిల్లాలో ఖాళీల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ తక్కువ పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ వెలువడడం పట్ల డీఎస్సీ అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. వాస్తవానికి జిల్లాలో 2500 పోస్టులు వరకు ఖాళీలు ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే రేషనలైజేషన్ చేస్తామని చెప్పి పోస్టులను కుదించగా 1714 ఖాళీలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. కానీ రేషనలైజేషన్ జరగలేదు. దీంతో సెప్టెంబర్ నాటికి మ్యాథ్స్‌లో 106, ఫిజికల్ సైన్స్ 19, బయలాజికల్ సైన్స్ 34, సోషల్ 131, ఇంగ్లీష్ 17, గ్రేడ్-1 తెలుగు 28, గ్రేడ్-1 హిందీ 3, లాంగ్వేజ్ తెలుగు పండిట్ 12, లాంగ్వేజ్ హిందీ పండిట్ 57, లాంగ్వేజ్ ఉర్దూ పండిట్ 1, ఎస్జీటీ తెలుగు మీడియం 1268, ఎస్జీటీ ఉర్దూ మీడియం 10, పీఈటీలో 28 పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులోను పోస్టులను తగ్గించి స్కూల్ అసిస్టెంట్లకు 307, లాంగ్వేజ్ పండిట్‌లకు 59, పీఈటీలకు 28, ఎస్జీటీలకు 793 మొత్తంగా 1187 ఖాళీలు ఉన్నట్లు అధికారులు జాబితాను ప్రభుత్వానికి సమర్పించారు. వాస్తవానికి సెప్టెంబర్ 5వ తేదీనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అయితే బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులలో అర్హత కల్పిస్తామని చెప్పి నోటిఫికేషన్‌ను వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
డీఎస్సీ షెడ్యూల్ విడుదల
Published Fri, Nov 21 2014 12:32 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
Advertisement
Advertisement