నిర్మల్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడాల్సిన సీఎం కిరణ్ నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ఆరోపించారు. ఇందిరమ్మ విజయరథం మంగళవారం జిల్లాలో ప్రవేశించింది. నిర్మల్ మండలం సోన్ గోదావరి వద్ద డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి నర్సారెడ్డి, ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్మల్ పట్టణం మీదుగా మండలంలోని మంజులాపూర్, చిట్యాల, దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్, లోలం మీదుగా దిలావర్‌పూర్ మండల కేంద్రానికి చేరుకుంది. ఆయా చోట్ల మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతాలు పలికారు.
నిర్మల్ మండలం మంజులాపూర్‌లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. నిర్మల్ పట్టణంలోని శివాజీచౌక్‌లో, మండలంలోని మంజులాపూర్, దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్, దిలావర్‌పూర్ మండల కేంద్రాల్లో ఆయన ప్రసంగించారు. నిర్మల్‌లో భోజనం చేసిన అనంతరం హన్మంతరావు విజయరథయాత్ర నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణచౌక్‌ని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హన్మంతరావు మాట్లాడారు.
ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి..
2004లో కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆనాడు తెలంగాణకు అనుకూలంగా ఉంటామని, తెలంగాణను ఇస్తామని ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రాష్ట్ర ప్రకటన చేశారని హన్మంతరావు అన్నారు. ఇందిరాగాంధీ ఆనాడు పేదల పక్షాన నిలబడి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని, ఆమె బాటలోనే కోడలిగా సోనియాగాంధీ నడుస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విలీనం కాకముందు నిజాం పాలనలో హైదరాబాద్‌లో సొంతంగా ఉస్మానియా ఆస్పత్రి, యూనివర్సిటీ, అసెంబ్లీ, సెక్రెటరియేట్, హైకోర్టు వంటి వాటితోపాటు ఆనాడే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉందన్నారు. ఇప్పుడేమో కొందరు సీమాంధ్రులు తాము వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పయ్యావుల కేశవ్ ఇటలీ నుంచి వచ్చి తెలుగు వాళ్లను విడదీయాలని చూస్తున్నారని సోనియాగాంధీని ఉద్దేశించి మాట్లాడటం సరైంది కాదన్నారు. 60 యేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మత్యాగాలకు వెరువకుండా పోరాడుతున్న ప్రజల చిరకాల స్వప్నాన్ని సోనియాగాంధీ గుర్తించారని, ఆ రుణాన్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హస్తం గుర్తుకే ఓటు వేసి తీర్చుకోవాలని అన్నారు. ఆయన వెంట నాయకులు రామలింగం, ఎంబడి రాజేశ్వర్, సిద్ద ముత్యం, నరేశ్ జాదవ్, రమేశ్, వెంకట్‌రాంరెడ్డి, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
సీఎం ద్రోహి
Published Wed, Jan 22 2014 1:38 AM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM
Advertisement
Advertisement