జూన్ 2 నుంచి డ్వాక్రా రుణాల మాఫీ
సామర్లకోట (తూర్పుగోదావరి): ఆంధ్రప్రదేశ్లోని అన్ని డ్వాక్రా సంఘాలకు జూన్ 2వ తేదీ నుంచి రుణమాఫీ అమలు చేయనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండల పరిధిలో నీరు-చెట్టు పనుల పరిశీలన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళా సంఘాలకు వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రతి సంఘానికి రూ.1 లక్ష చొప్పున, ప్రతి సభ్యురాలికి రూ.10 వేలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో 36 చెరువులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఏలేరు కాలువ అభివృద్ధికి గతంలో రూ.24 లక్షలు మంజూరు కాగా ప్రస్తుతం మరో 19 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు.