వారంతా విద్యార్థులు, ఉద్యోగులు. ఎక్కడైనా పేదలు ఆకలితో అల్లాడుతున్నారని తెలిస్తే వెంటనే స్పందిస్తారు. వృద్ధులు, వితంతువులు, పేదలకు ఆసరాగా నిలుస్తారు. బియ్యం, దుస్తులు, చెప్పులు వంటివి అందిస్తారు. పిల్లల నిరాదరణకు గురైన వారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తూ బతుకుపై భరోసా కల్పిస్తున్నారు. సేవ చేసేందుకు జిల్లాలతో సంబంధం లేదని చాటుతున్నారు. విశాఖ జిల్లా నుంచి జామి మండలంలోని భీమసింగి పంచాయతీ పరిధిలో ఉన్న ఏడు గ్రామాలకు చెందిన 200 మందికి ప్రతి నెలా సాయం చేస్తున్నారు.
- జామి
విశాఖపట్నానికి చెందిన ద్వారకా సాయి సేవా సమితి సభ్యులు 20 మంది కలిసి నిరాశ్రయులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సర్వే చేసి భీమసింగి పంచాయతీలో ఏడు గ్రామాలకు చెందిన వృద్ధులు, వితంతువులు, పేదలను 200 మందిని ఎంపిక చేశారు. ప్రతి నెల మొదటి ఆదివారం విశాఖ నుంచి భీమసింగి పంచాయతీలోని యాతపాలెం గ్రామానికి చేరుకుంటారు. ఎంపిక చేసిన 200 మందికి ఒక్కొక్కరికి నెలకు 3.5 కిలోల బియ్యం, దుస్తులు, చెప్పులు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్స చేయిస్తారు. అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. రెండేళ్లుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
విద్యార్థులే ఎక్కువ..
ద్వారకా సాయి సమితి సభ్యుల్లో విద్యార్థులే ఎక్కువ. కొద్దిమంది ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఉన్నారు. విశాఖపట్నంలోని కంచరపాలేనికి చెందిన సాయిసురేష్, శ్రీరామమూర్తి, సాయిరాం, పి.వెంకటరావు, ధరణి, రోజా, భవానీ, లోకే ష్, వేణు, పోలారావు తదితరులు ఈ సమితిలో సభ్యులు. వీరు తమ సొంత డబ్బులతో సేవ చేస్తున్నారు. ఈ బృందాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
సేవ చేయడంలోనే ఆనందం
‘సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉంటుంది. నిరాశ్రయులు, పేదలకు మాకు ఉన్నదానిలోనే సాయం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా వృద్ధులు, బీదలు ఉన్నారని తెలుసుకున్నాం. యాతవరానికి చెందిన ముత్యాలు అనే యువకుడి సహకారంతో రెండేళ్లుగా ప్రతి నెల ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.’
- సాయిసురేష్, పీజీ విద్యార్థి,
ద్వారకా సాయి సేవా సమితి సభ్యుడు
అభాగ్యులకు ఆసరా
Published Thu, May 19 2016 12:31 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM
Advertisement
Advertisement