బ్యాంకు నోటీసులను చూపుతున్న శ్రీ వెంకటేశ్వర, పవిత్ర గ్రూపు సభ్యులు
మహిళా సంఘాలు ఏర్పడినప్పటి నుంచి ఆ గ్రామంలో ప్రతినెలా సక్రమంగా పొదుపును జమ చేసుకుంటూ, బ్యాంకు నుంచి రుణాలను తీసుకుని అవసరాలకు వాడుకుంటూ కంతు మొత్తాన్ని చెల్లించుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారు. అలాంటి వారి జీవితాల్లో ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి రుణమాఫీ పేరుతో ఆశలు రేపారు. ఆ తర్వాత రుణాలు మాఫీ చేయకపోవడంతో వడ్డీ మీద వడ్డీ కట్టి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. తాజాగా డబ్బు చెల్లించాలంటూ నోటీసులు రావడంతో కసముద్రం మహిళలు ఆందోళన చెందుతున్నారు.
అనంతపురం, అమడగూరు: గత ఎన్నికల్లో పల్లె రఘునాథరెడ్డి రుణాల మాఫీ పేరుతో తమను వంచించాడని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలను గుప్పించి తర్వాత అమలు చేయడంతో పూర్తిగా విఫలమయ్యాడని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా డ్వాక్రా సంఘాల కింద రుణాలను తీసుకున్న అక్క, చెల్లెమ్మలంతా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదంటూ కసముద్రం సభల్లో చెప్పడమే కాకుండా గోడమీద రాతలు వాయించాడు. ఆ సమయంలో గ్రామంలో 28 మహిళా సంఘాలు జరుగుతుండగా, ప్రతి సభ్యురాలు రూ.10 వేలు రుణాన్ని తీసుకుని మూడు నెలలు కంతులు కూడా బ్యాంకుకు చెల్లించారు.
పల్లె హామీతో రుణాలు కట్టని మహిళలు..
అప్పట్లో ఎమ్మెల్యే పల్లె డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పడంతో మహిళలంతా ముక్కుమ్మడిగా కంతులు కట్టకుండా ఆపేశారు. తర్వాత ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని మర్చిపోయాడు. మహిళా సంఘాలన్నీ రుణాలను చెల్లించక, బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ కాగా మహిళలంతా ఆందోళలో ఉన్నారు. పైసా రుణం కూడా మాఫీ కాకపోవడంతో పాటుగా ఆనాటి నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే పసుపు–కుంకుమ డబ్బు, గ్యాస్ సబ్సిడీ, ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా, ఇంటి బిల్లులన్నీ బ్యాంకు అధికారులు జమ చేసుకుంటూ వచ్చారు. మరికొంత మంది ఇంట్లో తమ భర్తలను ఒప్పించుకుని రుణాలను చేతి నుంచి కట్టేశారు.
నోటీసులతో ఆందోళన
తాజాగా డిసెంబర్, జనవరి నెలల్లో మళ్లీ ప్రతి గ్రూపునకు డబ్బు చెల్లించాలంటూ గ్రూపులకు సంబంధించిన జామీనుదారులకు లక్షల రూపాయలు అప్పుందంటూ నోటీసులు పంపించారు. దీంతో ఖంగుతిన్న మహిళలంతా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఎంత పనిచేశాడమ్మా? మా జీవితాల్లో చిచ్చు పెట్టి మమ్మల్ని బ్యాంకుల వైపు కన్నెత్తి చూడకుండా చేసి, బజారున పడేశాడని గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యే మాటలు విని కసముద్రం, కంచరోళ్లపల్లి, చెర్లోపల్లి గ్రామాల్లో 28 మహిళా సంఘాల నిలిచిపోయి ఆయా కుటుంబాలకు ఎలాంటి ఆసరా లేకుండా వీధిన పడిపోయాయి. అంతేకాక భవిష్యత్తులో బ్యాంకు అధికారులు ఇంకెన్ని ఇబ్బందులు కల్గజేస్తారోనని, ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందించి మా రుణాలకు క్లీన్‌చిట్ ఇప్పిస్తే తిరిగి కొత్తగా గ్రూపులు నిర్వహించుకుంటామని పేర్కొంటున్నారు.
రూ.10 వేలకు రూ.67 వేలు కట్టా
నేను గ్రూపులో రూ.10 వే లు తీసుకుని అధికారుల ఒత్తిడి తట్టుకోలేక వడ్డీతో కలిపి రూ.67 వేలు మొత్తా న్ని ఒకేసారి కట్టేశాను. అయితే ఇప్పుడు మళ్లీ గ్యాస్ సబ్సిడీ డబ్బు పడుతుంటే అది కూడా పట్టేస్తున్నారు. మళ్లీ ఎందుకు పట్టేస్తున్నారో, ఇంకెంత అప్పు ఉంది అంటారోనని భయపడిపోతున్నాను. పసుపు–కుంకుమ డబ్బు, పావలా వడ్డీ ఇస్తామన్నా.. ఏదీ ఇవ్వలేదు. – తిప్పమ్మ,లక్ష్మీనరసింహస్వామి గ్రూపు, కసముద్రం
Comments
Please login to add a commentAdd a comment