పిడుగుల వర్షం.. గాలుల బీభత్సం | Eight dead in the state for Uncertain rains | Sakshi
Sakshi News home page

పిడుగుల వర్షం.. గాలుల బీభత్సం

Published Sun, Apr 21 2019 3:49 AM | Last Updated on Sun, Apr 21 2019 2:30 PM

Eight dead in the state for Uncertain rains - Sakshi

విశాఖ నగరంలో మెరుపులు

సాక్షి నెట్‌వర్క్‌/విశాఖపట్నం : ఛత్తీస్‌గఢ్‌ నుంచి కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి, భూమధ్య రేఖపై హిందూ మహా సముద్రానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో మరో ద్రోణి.. అలాగే కర్ణాటక పరిసరాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు బీభత్సం సృష్టించాయి. మరికొన్ని చోట్ల పెద్దఎత్తున పిడుగులు పడ్డాయి. అనేకచోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పిడుగులకు ఐదుగురు మృతిచెందారు. అనేకచోట్ల పశువులూ బలయ్యాయి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వడగళ్లు, పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, చెట్టు కూలి మరొకరు ప్రాణం విడిచారు. వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన గుమ్మా చిర్రయ్య (45) గేదల మేత కోసం పొలానికి వెళ్లగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు.


నూజెండ్ల మండలం ముతరాశుపాలెం గ్రామానికి చెందిన చిక్కుడు వెంకటకోటయ్య (30) గేదెలు తోలుకుని పొలం వెళ్లి వస్తుండగా, ఈపూరు మండలం అగ్నిగుండాలకు చెందిన సంకటి వెంకటేశ్వరరెడ్డి (70) పొలం పనుల కోసం వెళ్లగా పిడుగుపాటుతో మృతిచెందారు. అలాగే, మండల కేంద్రమైన కారంపూడికి చెందిన వ్యవసాయ కూలి షేక్‌ మస్తాన్‌బీ (45) పొలంలో మిరపకాయలు కోస్తుండగా పిడుగుపడి మృతిచెందింది. నూజెండ్ల మండలం పమిడిపాడు బ్రాంచ్‌ కెనాల్‌పై లస్కరు కర్రల శ్యాంసన్‌ (57) పమిడిపాడు బ్రాంచ్‌ కెనాల్‌కు నీరు విడుదల చేసేందుకు సిబ్బందితో ప్రకాశం జిల్లా బయ్యారం హెడ్‌ రెగ్యులేటర్‌ వద్దకు వెళ్లగా పెనుగాలులకు చెట్టుకొమ్మ విరిగిపడటంతో శ్యాంసన్‌ అక్కడిక్కడే మృతిచెందాడు.

నూజెండ్ల మండలం పమిడిపాడు, కారంపూడి మండలం ఒప్పిచర్లలో ఒక పాడి గేదె, సింగరుట్ల తండాలో మరో గేదె పిడుగులు పడి మృత్యువాత పడ్డాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఐనవోలు వద్ద వినుకొండ కురిచేడు ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. బొల్లాపల్లి మండలంలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షానికి సుమారు 100 ఎకరాల్లో వరిపంట నీటమునగగా మిర్చి, బొప్పాయి పంటలు నేలవాలాయి. ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

వైఎస్సార్‌ జిల్లాలో..
వైఎస్సార్‌ జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లెలో శనివారం సాయంత్రం పిడుగుపాటుకు ఐదు గొర్రెలు, మూడు మేకలు మృత్యువాతపడ్డాయి. బద్వేలులో బలమైన ఈదురుగాలులు వీచాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో కరెంట్‌ నిలిచిపోయింది. ఓ చోట ఇంటి గోడ కూలడంతో ఒక మహిళ గాయపడింది. ప్రకాశం జిల్లాలోనూ పలుచోట్ల శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దర్శి మండలం ఎర్రఓబయనపల్లిలో ఏడెకరాల బొప్పాయి తోట నేలమట్టమైంది. రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. అలాగే, కొనకమిట్ల మండలం పెదారికట్లలో వడగండ్ల వాన పడింది. పొదిలి మండలం మల్లవరం గ్రామంలో పిడుగుపాటుకు కోతి మృతిచెందింది. కనిగిరి, పామూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుపాటుకు గేదె మృతి చెందింది.

రెండుచోట్ల చెట్లు దగ్ధమయ్యాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల ఇళ్లపై చెట్లు పడడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలో తన పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడడంతో సత్యాల చిన్నయ్య (46) అనే వ్యక్తి షాక్‌కు గురై మృతిచెందాడు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, ముమ్మిడివరం, ప్రత్తిపాడు, తొండంగి మండలాలతోపాటు ఏజెన్సీలోని రాజవొమ్మంగి, దేవీపట్నం మండలాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విశాఖ నగరం చల్లని గాలులతో సేదతీరింది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండ.. ఉక్కబోతతో జనం అల్లాడిపోయారు. అంతలోనే దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. భారీగా గాలులు వీచాయి. పెద్దపెద్ద ఉరుములు మెరుపులు వచ్చాయి. చిరు జల్లులు కూడా పడడంతో జనం పులకించిపోయారు. పెందుర్తి మండలం కృష్ణరాయపురంలో పిడుగుపాటుకు ఈశ్వరరావు (35) అనే కలాసీ మరణించాడు.

విజయనగరం జిల్లాలో..
ఇక్కడ కూడా పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వేసవితో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఊరట లభించగా.. వర్షానికి వడగండ్లు తోడవడంతో పలుచోట్ల పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. బలమైన ఈదురుగాలులు వీయడంతో అరటి చెట్లు నేలకూలాయి. ముఖ్యంగా బొబ్బిలి, రామభద్రపురం, శృంగవరపుకోట, లక్కవరపుకోట, సీతానగరం, బలిజిపేట మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బొబ్బిలి పట్టణంలో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. దత్తిరాజేరు మండలం టి.బూర్జవలస గ్రామంలో ఈదురుగాలుల తాకిడికి చంద్రమ్మ (53) అనే వృద్ధురాలు అదుపుతప్పి రోడ్డుపై పడి మరణించింది. 

ఈరోజు, రేపు అప్రమత్తంగా ఉండండి
ఆది, సోమవారాల్లో కూడా కోస్తాంధ్ర, రాయలసీమల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆదివారం కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు.. రాయలసీమలో సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అకాల వర్షాలు, పిడుగులతో ప్రాణాపాయం ఏర్పడకుండా ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడచిన 24 గంటల్లో మెంటాడలో నాలుగు సెంటీమీటర్లు, శృంగవరపుకోట, తిరుమల, చిలమత్తూరు, వెంకటగిరికోటల్లో 2, లేపాక్షి, పార్వతీపురం, అర్థవీడు, బాలిజనపేట, ఎర్రగొండపాలెంలలో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షం కురిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement