
కొద్ది ఫారాలనే ఇచ్చినందున తపాలా సిబ్బందిని నిలదీస్తున్న బాధితులు
సాక్షి, ఒంగోలు: పదులు..వందలు..వేలు..ఇప్పుడు లక్షల్లో ఆధార్ సేవలను పొందేందుకు ప్రజలు వస్తుండటంతో నమోదు కష్టంగా మారింది. కేంద్రాల వద్ద పిల్లల నుంచి వృద్ధుల వరకు బారులు తీరుతున్నారు. ఈ నెల ఐదో తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డుల ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభించారు. తొలుత 12వ తేదీ నాటికి పూర్తి చేయాలనుకున్నారు. సర్వర్ మొరాయించడంతో నెలాఖరు వరకు గడువు పెంచారు. ఈనేపథ్యంలో డీలర్ల వారీగా ఈకేవైసీ కాని కార్డుదారుల వివరాలతో జాబితాలను సిద్ధం చేసి వాటికి అనుగుణంగా నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 9,90,501 తెలుపు కార్డుదారులున్నారు. వీరికి సెప్టెంబర్ నెల రేషన్ రావాలంటే కార్డు పరిధిలోని సభ్యుల వివరాలు ఈకేవైసీ నమోదై ఉండాలి. ఇలా నమోదు కాని యూనిట్లు జిల్లాలో 4,72,741 లెక్క తేల్చారు. కానీ తెల్లకార్డుల్లో 10,543 మంది సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సీఎఫ్‌ఎంఎస్) కింద వేతనాలు పొందుతున్న వారున్నారు. వీరిని ఆయా కార్డుల నుంచి తొలగించాలి. ఈకేవైసీ లేని వారిని నమోదు చేయించాలి. ముందుగా డీలరును సంప్రదిస్తే వారి వద్ద ఉన్న జాబితా ప్రకారం ఈకేవైసీ లేని వారి వివరాలను తెలిపి అక్కడే నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటారు. సాధికార సర్వేలో నమోదు కాని వారు ఉంటే వారిని సంబంధిత పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలోని నమోదు కేంద్రాలను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆధార్ అనుసంధానం కాని వారిని మీ సేవ, ఈ సేవ కేంద్రాలను, బ్యాంకులు, పోస్టాఫీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ మొదలయి 15 రోజులైనా ఇప్పటికి 20 శాతానికి మించి పని జరగలేదు.
కిక్కిరిస్తున్న కేంద్రాలు
ఆధార్ సేవలను పొందే కేంద్రాలు కిక్కిరిస్తున్నాయి. ఎందుకంటే నమోదులో వేగం లేదు. సర్వర్ పని చేయకపోవడం, పని చేసినా నెమ్మదించడంతో కాలహరణం జరుగుతోంది. మీసేవ, ఈ సేవ కేంద్రాలు, తపాలా కార్యాలయాలు, బ్యాంకుల వద్ద రద్దీ నెలకుంది. సాంకేతిక ఇబ్బంది వల్ల ప్రజలు ఆధార్ సంఖ్య పొందడం సవరణలను చేయించుకోవడం ప్రహసనంగా మారింది. కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. జనం తాకిడికి తగినట్లుగా కేంద్రాలు లేవు. జనానికి పట్టపగలే చుక్కలు కన్పిస్తున్నాయి. పిల్లలు, విద్యార్థులు, యువకులు, వృద్ధులు క్యూ లైనులో బారులు తీరుతున్నారు. వీరికి తగిన విధంగా సౌకర్యాలను కల్పించలేకపోతున్నారు. ఉదయాన్నే ఒంగోలు తపాలా కేంద్ర కార్యాలయం వద్ద నమోదు కోసం బారులు తీరుతున్నారు. నిత్యం గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈకేవైసీ పూర్తి కాకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వర్తించవన్న హెచ్చరికల నేపథ్యంలో కార్డుదారుని కుటుంబంలోని సభ్యులు నమోదుకు బారులు తీరుతున్నారు.
పోస్టాఫీస్ వద్ద ఈకేవైసీ కోసం బారులు తీరిన పౌరులు
టోకెన్లు ఇవ్వడంలో రగడ
నమోదు కేంద్రాల్లో టోకెన్ల జారీలో రగడ జరుగుతోంది. ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ నమోదుకు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు వద్ద టోకెన్ల పద్ధతిని ప్రవేశపెట్టారు. మంగళవారం ఉదయం ఒంగోలు తపాలా కేంద్ర కార్యాలయం వద్ద రగడ జరిగింది. టోకెన్లు కొద్ది సంఖ్యలోనే ఇచ్చారు. ఇంతకు మించి నమోదుకు సహకరించదని అధికారులు చెబుతున్నా బారులుతీరిన ప్రజానీకం తిరగబడ్డారు. పిల్లలు, యువకులు వేరే ప్రాంతాల్లో ఉంటుంటే వారిని దీని కోసమే పిలిపించామని అంటున్నారు.
ఎన్‌ఫోర్సుమెంట్ అధికారుల పర్యవేక్షణ
జిల్లాలోని ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులతో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. జేసీ సగిలి షన్మోహన్ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఒంగోలు–1, ఒంగోలు–2, చీరాల, అద్దంకి, సింగరాయకొండ, కందుకూరు, మార్కాపురం, పర్చూరు, యర్రగొండపాలెం, దర్శి, నిగిరి, పొదిలి ఎన్‌ఫోర్సుమెంట్ డీటీలు, ఆహార తనిఖీ అధికారులు వారి పరిధిలోని డీలర్లను దత్తత తీసుకొని వారిని గంట గంటకు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి వరకు నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
లక్ష లోపే
డీలర్ల వద్ద యూనిట్లలో ఇప్పటికి అనుసంధానించింది లక్ష యూనిట్లలోపే నమోదైంది. ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. మ్యుటేషన్లు నమోదు కావడం లేదు. 10,543 కార్డుల్లో సీఎఫ్‌ఎంఎస్ కింద వేతనాలు తీసుకుంటున్న వారు ఉన్నారని వాటిని ఇన్‌యాక్టీవ్‌లో ఉంచారు. వచ్చే నెల ఈ కార్డులకు ఏ విధంగా సరుకులను ఇస్తారో ఇంత వరకు ఇతిమిద్దమైన ఆదేశాలు లేవు.
డీఎస్వో వెంకటేశ్వర్లు ఏమంటున్నారంటే..
ఈకేవైసీ నమోదులో సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎస్వో టి.వెంకటేశ్వర్లు తెలిపారు. సర్వర్ ఇబ్బందులను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని అన్నారు. డీలర్లు ఎక్కువ మంది రాజీనామాలు చేసి ఉన్నారని, అలాంటి చోట ఇబ్బందులు లేకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. ఈకేవైసీ నమోదుకు నెలాఖరు వరకు గడువు ఉందన్నారు.
అధిక శాతం చిన్నారులే..
ఈకేవైసీ నమోదుకు అధిక శాతం చిన్నారులే వస్తున్నారు. మొత్తం 4,72,741 యూనిట్లలో 2.15 లక్షల యూనిట్లు చిన్న పిల్లలవే. గతంలో ఆధార్ పొందిన సమయంలో వయస్సు తక్కువ కావడంతో వారి వేలిముద్రలు తీసుకోలేదు. ఐదేళ్లు పైబడిన వారంతా తప్పనిసరిగా వేలిముద్రలు (బయోమెట్రిక్), కనుపాప నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాతే ఈకేవైసీని అనుమతిస్తున్నారు. దీంతో ఆధార్ కేంద్రాల్లో ఎక్కడ చూసినా చిన్నారులే బారుతుతీరుతున్నారు. తెల్లవారగానే ఆధార్ కేంద్రాలకు చేరుకుంటే మధ్యాహ్నం భోజన సమయానికి కూడా వెళ్లలేకపోతున్నారు. ఈకేవైసీ బాధ్యత డీలర్లతో పాటు మీ సేవ కేంద్రాలకు అప్పగించారు. ఈ రెండు చోట్ల జాప్యం జరుగుతోంది. తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నా సర్వర్ ఇబ్బందులతో నమోదు కార్యక్రమం ముందుకు పోవడం లేదు.