మిర్యాలగూడ, న్యూస్‌లైన్: రాబోయే సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ ముగియగా డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియ, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ నెల 21వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితాను వెల్లడించాలని మొదట్లో నిర్ణయించినా కొంత ఆల స్యంగా ఈ నెల 31వ తేదీన వెల్లడించనున్నారు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలలోని మౌలిక సదుపాయాలను సంబంధిత తహసీల్దార్లు, ఎస్‌ఐలు, బూత్ లెవల్ అధికారులు పరిశీలి స్తున్నారు. పోలింగ్ బూత్‌లలో మంచినీరు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ సౌకర్యాలు ఉన్నాయో లేవో చూస్తున్నారు.
సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలలోని పోలింగ్ బూత్‌లను కూడా గుర్తించి ముందస్తుగానే ఎన్నికల అధికారులకు నివేదిక అందించేందుకు పరిశీలనలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3020 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2009 సాధారణ ఎన్నికలు, ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలను గుర్తిస్తున్నారు. దీంతో పాటు ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండలాల వారీగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ నెల 24న రాష్ర్టస్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు.
31న తుది జాబితా ప్రకటన
నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార యంత్రాంగం తుది జాబితాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనుంది. నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2013 నవంబర్ 18వ తేదీ నుంచి 2013 డిసెంబర్ 23వ తేదీ వరకు చేపట్టారు. కాగా ప్రస్తుతం డబుల్ ఓట్ల తొలగింపు కార్యక్రమంతో పాటు తుది జాబితా ప్రకటనకు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31వ తేదీన ఆర్డీఓ, తహసీల్దార్లు అన్ని పోలింగ్ స్టేషన్లలో తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు.
నియోజకవర్గానికి ఓ అధికారి
ఓటర్ల నమోదుతో పాటు ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను చేపట్టడానికి నియోజకర్గానికి ఒక అధికారిని నియమించారు. గతంలో రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నింటికీ ఆర్డీఓ ఎన్నికల అధికారిగా ఉండే వారు. కానీ ప్రస్తుతం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ఎన్నికల అధికారులుగా నియమించారు. ఓటర్ల జాబితాలను సిద్ధం చేసే ప్రక్రియను వీరే చేపడుతున్నారు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 12మంది డిప్యూటీ తహసీల్దార్లను నియోజకవర్గ ఎన్నికల అధికారులుగా నియమించారు.
జిల్లాలో 3020 పోలింగ్ కేంద్రాలు
జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 3020 పోలింగ్ కేంద్రాలున్నాయి. 2013 నవంబర్ నాటికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో 25,19,559 ఓటర్లు ఉన్నారు. కాగా కొత్తగా ఓటర్ల నమోదు కార్యక్రమం పూర్తికావడం వల్ల తుది జాబితా పూర్తయ్యే వరకు 2 నుంచి 4 శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉంది.
ఎన్నికల కసరత్తు షురూ
Published Fri, Jan 24 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement
Advertisement