
విద్యుత్ చార్జీల షాక్ జిల్లాపై భారం రూ.120 కోట్లు!
విద్యుత్ వినియోగదారులకు చార్జీల షాక్ తగలనుంది. ఈ మేరకు విద్యుత్ బిల్లుల పెంపుదలకు రంగం సిద్ధమవుతోంది.
విజయనగరం మున్సిపాలిటీ: విద్యుత్ వినియోగదారులకు చార్జీల షాక్ తగలనుంది. ఈ మేరకు విద్యుత్ బిల్లుల పెంపుదలకు రంగం సిద్ధమవుతోంది. విద్యుత్ చార్జీల పెంపుదల ప్రతిపాదనలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌నియంత్రణ మండలికి విద్యుత్‌పంపిణీ సంస్థలు అందజేశాయి. ఆమోదం పొందితే జిల్లా వినియోగదారులపై ఏడాదికి రూ.120 కోట్లు భారం పడనుంది. ఇప్పటికే వివిధ సమస్యలతో సతమతమవుతున్న జిల్లా వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతిపాదనలు పంపిన విషయం తెలుసుకున్న జిల్లా వాసులు ధర్నాల రూపంలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
100 యూనిట్లు పైబడి వినియోగించే వారిపై బాదుడే....
గృహావసరాలకు సంబంధించి నెలకు 100 యూనిట్లు వరకు వినియోగించే వినియోగదారులకు పెంపుదల నుంచి మినహాయింపు ఇవ్వనుండగా.. ఆపై యూనిట్ల విద్యుత్ వినియోగించే వారిపై భారీ మొత్తంలో చార్జీల భారం పడనుంది. గృహావసరాల విద్యుత్ సర్వీసులకు సంబంధించి నెలకు 101 యూనిట్ల నుంచి 150 యూనిట్లు విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఇకపై యూనిట్‌కు 18పైసలు చార్జీ పెరగనుంది. అదేవిధంగా 151 నుంచి 200 యూనిట్ల శ్లాబ్‌లో ప్రతి యూనిట్‌కు 36 పైసలు చొప్పున పెంచడంతో పాటు విద్యుత్ చార్జీల ఖరారులో టెలిస్కోపిక్ విధానాన్ని అమలుచేయనున్నారు.
అదేవిధంగా నెలకు 500 యూనిట్లకు పైబడి వినియోగించే వినియోగదారులపై యూనిట్‌కు రూ.50పైసలు చొప్పున భారం పడనుంది. వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కూడా ఇదే తరహాలో పెరుగుదల ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా వంద యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించేవారు చాలా తక్కువగా ఉంటారు. విద్యుత్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 5 లక్షల 73వేల 240 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వీటిలో కేటగిరి-1 వినియోగదారులకు సంబంధించి నాలుగు శ్లాబుల్లో చార్జీలు విధిస్తున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సగటున నెలకు రూ.57 కోట్ల ఆదాయం విద్యుత్ చార్జీల రూపంలో వసూలవుతోంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌నియంత్రణ మండలికి విద్యుత్‌పంపిణీ సంస్థలు అందజేసిన ప్రతిపాదనల ఆధారంగా జిల్లా పై ఏడాదికి రూ.120 కోట్ల భారం పడనుంది.